నిరసనలతో దద్దరిల్లిన లండన్..
` లక్ష మందితో భారీ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ
` అక్రమ వలసలు దేశానికి భారమంటూ మిన్నంటిన ఆందోళనలు
` నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట
` 26 మంది పోలీసు అధికారులకు గాయాలు
లండన్(జనంసాక్షి):యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) రాజధాని లండన్ నగరం వలస వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లింది. యాంటీ-ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్‌సన్ ఆధ్వర్యంలో ‘యూనైట్ ద కింగ్‌డమ్’ పేరుతో జరిగిన ఈ ర్యాలీలో లక్షకుపైగా నిరసన కారులు పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.యూకేలో జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శనల్లో ఇదొకటిగా చెబుతున్నారు.ఈ నిరసన ప్రదర్శనలో ఇటు పోలీసులు, అటు నిరసనకారుల మధ్య తోపులాటలు జరిగాయి.యాంటీ-ఇమిగ్రేషన్ కార్యకర్త రాబిన్‌సన్ నేతృత్వంలో యునైట్ ది కింగ్‌డమ్ ర్యాలీ సమయంలోనే ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ ప్రదర్శన కూడా జరిగింది. దీనిలో సుమారు ఐదువేల మంది పాల్గొన్నారు. ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా, నిరసనకారులు పోలీసులపై బాటిల్స్‌తో పాటు పలు వస్తువులతో దాడులు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 26మంది అధికారులు గాయపడ్డారని, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పమాచారం. అల్లర్లకు పాల్పడ్డ 25 మందిని అరెస్టు చేశామని. మరింతమందిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ మాట్ ట్విస్ట్ మీడియాకు తెలిపారు.ఈమధ్య బ్రిటన్‌కు అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 28 వేల మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు పలు రిపోర్టులు చెబున్నాయి. ఇలా వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం వలసదారులను హోటళ్లలో ఉంచుతుండటంతో, స్థానికులు అక్కడకు చేరుకుని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వలసదారులు స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు అంటున్నారు. అక్రమ వలసలు దేశానికి భారంగా మారారని యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రిఫార్మ్ యూకే తదితర పార్టీలకు ఇది కీలక అజెండాగా మారింది. రాబిన్‌సన్ ఈ అంశాన్ని మరింతగా పెద్దదిచేస్తూ, ర్యాలీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. టామీ రాబిన్సన్‌కు బిలియనీర్ ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖుల మద్దతు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా లండన్‌లో జరిగిన ర్యాలీలో నిరసనకారులు అమెరికా టోపీలు, ఇజ్రాయెల్ జెండాలు ప్రదర్శించారు. యాంటి ఇమిగ్రేషన్ నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శిస్తూ నిరసనల్లో పాల్గొన్నారు.
ఆందోళనలకు తలొగ్గేది లేదు
నిరసనలను తీవ్రంగా ఖండిరచిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
లండన్(జనంసాక్షి):వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ‘యునైట్ ది కింగ్‌డమ్’ పేరిట లండన్ వీధుల్లో నిర్వహించిన ప్రదర్శనలో లక్షమందికిపైగా ఆందోళనకారులు పాల్గొన్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వాటర్ బాటిళ్లు, వస్తువులతో దాడులు చేశారు. ఈ పరిణామాలను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండిరచారు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు.‘‘ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది. అయినప్పటికీ.. రంగు, నేపథ్యం ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సహించబోం. అధికారులపై దాడి చేయడం ద్వారా ఆందోళనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. సహనం, వైవిధ్యం, గౌరవమనే పునాదులపై బ్రిటన్ నిర్మితమైంది. జాతీయ జెండా దేశంలో వైవిధ్యతను సూచిస్తుంది. హింస, భయం, విభజనకు చిహ్నంగా ఉపయోగించేందుకు దానిని ఎప్పటికీ అప్పగించబోం’’ అని ఓ వార్తాసంస్థతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.