విమర్శలు కాదు.. దర్యాప్తు చేయించాలి
` రాహుల్ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన మాజీ సీఈసీ ఎస్. వై.ఖురేషీ
న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్. వై.ఖురేషీ వ్యతిరేకించారు. ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడానికి బదులు..ఈసీ వాటిపై దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సిందని అన్నారు. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉందని చెప్పారు. బిహార్‌లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను నిర్వహించిన విధానాన్ని కూడా మాజీ ఎన్నికల కమిషనర్ తప్పుబట్టారు.సరైన విధంగా విధులు నిర్వహించకపోవడం వల్ల ఎన్నికల కమిషన్‌పై విమర్శలు వస్తుంటే మాజీ కమిషనర్‌గానే కాకుండా భారత పౌరుడిగానూ తాను తీవ్ర వేదనకు గురవుతానని ఖురేషీ అన్నారు. ఎన్నికల విషయంలో ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయాలను ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మన నిర్ణయాలను ప్రభావితం చేసే అన్ని శక్తులు, ఒత్తిళ్లను ఎదుర్కొనే విధంగా అధికారులు ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ ప్రజల, ప్రతిపక్షాల విశ్వాసాన్ని గెలుచుకునేలా ఉండాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలతో మాట్లాడితేనే చాలా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. తాను ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ప్రతిపక్షాలు తనను కలవడానికి వస్తే తప్పకుండా వారి వాదనలు వినేవాడినని చెప్పారు.ఎన్నికల సమయంలో తీసుకువస్తున్న కొత్త ఓటర్ల జాబితాలో కూడా ఎటువంటి తప్పులు లేవని మీరు అఫిడవిట్ ఇవ్వగలరా అని ఎన్నికల కమిషన్‌ను ఖురేషీ ప్రశ్నించారు. ఒకవేళ అందులో తప్పులు ఉన్నాయని తేలితే ఎన్నికల అధికారులు సైతం శిక్ష అనుభవించాల్సి వస్తుందని..దానికి మీరు సిద్ధమేనా అని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ.. రాజకీయ పార్టీలతో తాము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నామని..ఇంత నిర్మాణాత్మక పద్ధతిలో మరెక్కడా సమావేశాలు జరగవని పేర్కొంది.