ఆందోళనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తిస్తాం

` నేపాల్‌ తాత్కాలిక ప్రధాని కర్కీ ప్రకటన
ఖాట్మాండ్‌(జనంసాక్షి):నేపాల్‌లో సోషల్‌ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్‌ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కీ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.అనంతరం, ప్రధాని సుశీలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల్లో భాగంగా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. నేపాల్‌లో నిరసనలు, ఆందోళనల వేళ ప్రభుత్వ ఆస్తు?లను ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని తెలిపారు. ఆరు నెలలకు మించి ఈ పదవిలో ఉండబోమని, ఆ తర్వాత కొత్త పార్లమెంట్‌కు బాధ్యతలను అందిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే బాధ్యతలు చేపట్టాం. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం అవసరమని, వారి మద్దతు లేకుండా తాము విజయం సాధించలేమని అన్నారు. ఇక, ఈరోజు తాత్కాలిక ప్రభుత్వంలో కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉంది.ఇదే సమయంలో ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా ‘అమరవీరులు’గా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారు. అధికారం కోసం కాకుండా దేశాన్ని తిరిగి గాడిన పెట్టడానికే తాము వచ్చినట్టు వెల్లడిరచారు. దీంతో, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.