సంపాదకీయం

  తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం,వరంగల్‌ జిల్లాల్లో అపారంగా విస్తరించిన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పన్నిన కుట్ర భగ్నమైంది.అయితే  వైఎస్‌ చనిపోయిన తర్వాత ఈ కుట్రకు అడ్డుకట్ట పడింది. దీంతో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, గూడూరు తదితర ప్రాంతాల్లోని లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ నిక్షేపాలను వైఎస్‌ అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు అడ్డగోలుగా ధారాదత్తం చేయాలనే వ్యూహానికి గండిపడింది. బయ్యారం గనుల సంబంధించిన రక్షణ స్టీల్స్‌కు ఇచ్చిన లీజ్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని  కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఏపీఎండీసీకి ఉత్తర్వుల జారీ కోసం చేయడం సాహసోపేత నిర్ణయమే. ఇది ముమ్మాటికీ తెలంగాణాకు మేలు చేకూర్చే నిర్ణయమే.
తెలంగాణ ప్రాంతంలోని ఖనిజ సంపదను తమ బంధువులకు దోచి పెట్టేందుకు వైఎస్సార్‌ ఎంతటి తెగింపునకు పాల్పడ్డారో బయ్యారం గనుల వ్యవహారమే తేటతెల్లం చేసోరది.ఖమ్మం, వరంగల్‌ జిల్లాలో ఖనిజ సంపద విస్తరించి ఉన్న 1,41,725 ఎకరాలను రక్షణ స్టీల్స్‌కు ధారాదత్తం చేసిన విషయం తెలిసిందే.ఆయన బతికి ఉంటే మరెంత దోచిపెట్టేవారో ఊహించడమే కష్టం. సహజ సంపద మన జాతి సంపద. జాతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. జాతి సంపదను దోచుకోవడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలి. దేశవ్యాప్తంగా ఉన్న సహజ సంపదను దోచేందుకు అన్ని చోట్లా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సహజ వనరుల దోపిడీకి గురవుతున్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రమూ చేరింది. అక్రమ మార్గంలో మైనింగ్‌లు చేజిక్కించుకున్న వారంతా మాఫియాలుగా తయారవుతున్నారు.  ఒబులాపురం మైనింగ్‌ దక్కించుకున్న గాలి జనార్దన్‌ రెడ్డి కర్ణాటక రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. అంతేకాకుండా న్యాయమూర్తిని కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నాడంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.కాగా మరికొందరు జైలుపాలవుతున్నారు. అక్రమాస్తుల కేసుల్లో జైలుకెళ్లిన వారికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం విడ్డూరమే. అయితే ఈ పరిస్థితి కొంత వరకే. వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాక ఆ నేతలకు ప్రజలకు దూరమవుతారు. అయితే ఇప్పుడు కావల్సిందల్లా ప్రజల్లో చైతన్యం నింపడం. డబ్బుతో రాజకీయాలు చేయాలనుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.అయితే తెలంగాణలో మాత్రం ఆ పార్టీల పరిస్థితి ఇందుకు భిన్నం. తెలంగాణలో ఉద్యమాలు వల్ల ప్రజలు చైతన్యశీలురుగా ఎదగడం, విశ్వవిద్యాలయాల నిత్యచైతన్య వేదికలుగా మారడం ఇందుకు కారణం.