సకల జనుల హామీలు అమలుచేయండి

సింగరేణి సీఎండీకి డిమాండ్ల పత్రం
అలక్ష్యం చేస్తే ఆందోళన తప్పదు : కోదండరాం
హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) :
సకల జనుల సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం గురువారం సింగరేణి కాలరీస్‌ కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుతీర్థ భట్టాచార్యను కలిసి కోరింది. ఈ మేరకు ఆయనకు ఒక వినతిపత్రం సమర్పించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అమలులో జాప్యం చేస్తే ఆందోళన తప్పదని ఆ వినతిపత్రంలో హెచ్చరిం చారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు భాగస్వాములయ్యారు. సమ్మె విరమణ వరకూ వారు సమ్మెలో కొనసాగారు. సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం గని కార్మికులకూ హామీలు ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఆ సంస్థ సీఎండీని కలిసి హామీల అమలు గురించి కోరామని కోదండరాం తెలిపారు. సింగరేణి సీఎండీని కలిసిన ప్రతినిధి బృందంలో కోదండరాంతోపాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారకరామారావు, సోమారపు సత్యనారాయణ, అరవింద్‌కుమార్‌, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుమన్‌ తదితరులు ఉన్నారు.