సిరిసిల్లలో ఎగిసిపడ్డ తెలంగాణ ఆత్మగౌరవ జ్వాలలు

మొసలి కన్నీరుకు ముచ్చెమటలు
గర్జించిన తెలంగాణ సమైక్యవాదుల గజగజ
దారిపొడవునా నిలదీతలు… ఎదురీతలు
చెప్పులు, కోడిగుడ్లు, రాళ్ళతో ‘ఘన’స్వాగతం
వందలాదిగా ప్రైవేటు గూండాలు.. వేలకు వేల పోలీసోల్లు ..
విజయమ్మ యాత్రకు ‘బందో బస్తు ‘
మహిళలపై మగ పోలీసలు, సీమాంధ్ర గూండాల జులుం
సభా స్థలిలో మార్మోగిన జై తెలంగాణ నినాదాలు
విరిగిన లాఠీలు.. సొమ్మసిల్లిన పోరుబిడ్డలు
లాఠీ చార్జీలో ఒకరిపరిస్థితి విషమం
నేడు కరీంనగర్‌ బంద్‌
సిరిసిల్ల, జూలై 23 (జనంసాక్షి):
సిరిసిల్లలో ఆత్మగౌరవ జ్వాలలు ఎగిసిబడ్డాయి. అడుగడుగున ఓ పోలీసు..అనుమానం వచ్చిన వారిపై లాఠీ దెబ్బలు ఇదంతా చూసిన తెలంగాణ ప్రజల గుండెలు మండిపోయాయి. తమ సమస్యల పరిష్కారానికై అంటూ మొసలికన్నీరు కారుస్తూ తెలంగాణపై గడ్డపై అడుగుపెట్టిన విజయమ్మకు పోరుబిడ్డలు చుక్కలు చూపించారు. అడ్డంకులు, అవరోధాలు, నిరసనలు, ఆందోళనలు ఇది వైఎస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు తెలంగాణలో ఎదురైన పరిస్థితి. హైద్రాబాద్‌లో ప్రారంభమైన చేనేత దీక్ష యాత్ర అడుగడునా నిలదీతలు, కొన్ని ప్రాంతాల్లో మహిళలు చెప్పులు చూపించారు. సిరిసిల్లాను యుద్ధభూమిగా మార్చిన సీమాంధ్ర అహంకారపూరిత రాజకీయ నాయకురాలైన విజయమ్మకు తెలంగాణ ప్రజలు ముచ్చెమటలు పట్టించారు. వందలాది మంది పోలీసుల పహారా, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు కర్రలతో కాపలాకాయగా విజయమ్మ కాన్‌వాయ్‌ సాగింది. సోమవారం ఉదయం హైదారాబాద్‌ నుండి బయలుదేరిప్పటినుండి తెలంగాణలో అడుగడుగున తెలంగాణ వాదులు అడ్డుకొని తెలంగాణ పై వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వేలాదిమంది పోలీస్‌ బందోబస్తూ మధ్య కొనసాగిన విజయమ్మ యాత్రకు ఎక్కడ ఈ ప్రాంత ప్రజలనుండి స్పందన కన్పించలేదు. విజయమ్మ యావత్తు పోలీసులు, వైయస్సార్‌ సీపీ కార్యకర్తలే అధికంగా ఉన్నారు. దారిపొడవున తెలంగాణ వాదులు తమ నిరసన గళాలు వినిపించారు. ఆందోళనలు ఉదృతమవుతాయనీ తెలిసి పోలీసులు టిఆర్‌ఎస్‌ యంఎల్‌ఏలను, కార్యకర్తలను, తెలంగాణవాదులను అరెస్టులు, గృహనిర్బందం చేసింది. మంగళహారతులతో తమ యాత్రకు స్వాగతం పలుకుతారనుకున్న విజయమ్మకు చెప్పులు..కోడిగుడ్లతో ఘన స్వాగతం పలికారు. విజయమ్మ కాన్వాయిని అడ్డుకొన్న తెలంగాణవాదులపై పోలీసులు తమ లాఠీలతో విరుచుకుపడ్డారు. దీక్ష జరుపుతున్నంతసేపు తెలంగాణ వాదులు జైతెలంగాణ నినాదాలు చేశారు. సభావేదికపై కోడిగుడ్లు విసిరారు. దీంతో వేదికపై ఉన్న పార్టీ నాయకులు, అంగరక్షకులు విజయమ్మను కవర్‌ చేస్తూ నిలబడ్డారు. దీంతో అసలు వేదికపై విజయమ్మ ఎక్కడ ఉందో కనబడలేతు. దీక్ష సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళా కార్యకర్తను విచక్షణ రహితంగా జీబుపైనుండి కిందికి తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులపై వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు దాడి చేయడంతో తెలంగాణవాదులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళలపై మగ పోలీసులు, సీమాంధ్ర గుండాలు తమ జులుం ప్రదర్శించారు. పోరుగడ్డ పౌరుషం చూపిన పోరుబిడ్డలపై ఖాకీలు, గుండాలు విచక్షణారహితంగా దాడి చేయడంతో వారు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ దాడిలో గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విజయమ్మ యాత్ర ముమ్మాటికి తెలంగాణపై దండయాత్రేయని జేఎసి చైర్మెన్‌ కొదండరాం తెలిపారు. విజయమ్మ చేనేత దీక్ష యాత్రను కాంగ్రెస్‌ ఎంపిలు, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌లు తీవ్రంగా ఖండించారు. వీసావుంటేనే తెలంగాణలో అడుగుపెట్టాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ రాజశేఖర్‌ రెడ్డి సతీమణి ఏ వీసా పట్టుకొని తెలంగాణలో అడుగుపెట్టిందో సమాదానం చెప్పాలన్నారు. సిరిసిల్లలో విద్యార్థులు, తెలంగాణవాదులపై దాడికి నిరసనగా నేడు కరీంనగర్‌ జిల్లా బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది.