హైదరాబాద్‌ పీస్‌ సిటీ

– న్యూయార్క్‌ కంటే మనమే నయం

– హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌

హైదాబాద్‌,డిసెంబరు 21 (జనంసాక్షి):ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రాంగణంలో సోమవారం క్రైం వార్షిక ప్రెస్‌విూట్‌ నిర్వహించారు. గతేడాదితో పోల్చితే హైదరాబాద్‌ సీపీ పరిధిలో క్రైమ్‌ రేటు 10 శాతం తగ్గినట్లు సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఇక 2019 లో 25,187 కేసులు నమోదు కాగా.. 2020లో 22,641 నమోదయినట్లు వార్షిక నివేదిక వెల్లడించింది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల్లో 19శాతం, 35శాతం తగ్గుదల కనిపించింది. 2019లో మహిళలపై నేరాలకు సంబంధించి 2,354 కేసులు నమోదు కాగా.. 2020లో 1,908 కేసులు నమోదు అయినట్లు నివేదిక వెల్లడించింది. 2019లో పిల్లలపై నమోదైన కేసులు 339, కాగా 2020లో 221 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జీహెచ్‌ఎసీంలో 1,46,55,520 రూపాయల నగదు సీజ్‌ చేసినట్లు వార్షిక క్రైమ్‌ రిపోర్టు వెల్లడించింది.ఈ సందర్భంగా అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ పోలీసులకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. 80 దేశాల విద్యార్థులు ఇక్కడున్నారు. హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. న్యూయార్క్‌ సిటీతో పోల్చితే హైదరాబాద్‌లో మర్డర్స్‌ తక్కువ. 2020 లోన్యూయార్క్‌లో 310 హత్యలు జరగ్గా హైదరాబాద్‌ సిటీలో కేవలం 64 మాత్రమే జరిగాయి. 2020 లండన్‌లో సైతం హైదరబాద్‌ కంటే మర్డర్స్‌ రేటు ఎక్కువే ఉంది. 2019తో పోల్చితే హైదరాబాద్‌లో క్రైం రేట్‌ 10శాతం తగ్గింది’ అన్నారు.సైబర్‌ క్రైం పెరిగింది..ఈ సందర్భంగా అడిషపల్‌ సీపీ శిఖా గోయల్‌ మాట్లాడుతూ.. ‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్‌ క్రైం పెరిగింది. 2019లో 1,393 సైబర్‌ కేసులు నమోదయితే 2020 లో 2,406 కేసులు నమోదు అయ్యాయి. ఇంటర్‌ నెట్‌ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌ క్రైమ్‌లు రాజస్తాన్‌లోని జంతారా నుంచే జరుగుతున్నాయి. 25 శాతం ఓటీపీ మోసాలు పెరిగాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌ యువతను ఆకర్షిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్‌ వేధింపులు ఈ మధ్య భారీగా పెరిగాయి. 100 యాప్‌లు గూగుల్‌ ప్లేస్టోర్‌ లో ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్‌ ద్వారా అప్పులు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో భాదితుల ఫోటోలు, అలాగే కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపుతున్నారు. వీరి వేధింపులకు ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు. ఇలాంటి యాప్‌లు ఎవరు డౌన్‌లోడ్‌ చేసుకొని మోసపోవద్దు’ అన్నారు.’ఈ ఏడాది సైబర్‌ క్రైమ్‌ నేరాలు చేసిన 12 రాష్ట్రాలకు చెందిన 259 మంది ఇప్పటి వరకు అరెస్ట్‌ అయ్యారు. 19 మ్యాట్రిమోని కేసులు నమోదు అయ్యాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. చైనా బేస్‌గా ఆన్‌లైన్‌ గేమింగ్‌పై తెలంగాణలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌ తెలంగాణలో నిషేధం. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కేసులో 170 బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేశాం. చైనా దేశస్తుడిని అరెస్ట్‌ చేశాం. ఇప్పటి వరకు 16వందల కోట్ల ట్రాన్సక్షన్‌ జరిగినట్టు గుర్తించాం’ అని శిఖా గోయల్‌ తెలిపారు.