అంగన్‌వాడీల జీవన ప్రమాణాలు పెంచుతాం

5

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడి కేంద్రాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్ల జీవన ప్రమాణాలు పెంచుతామని,గ్రామస్థాయిలో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యం కల్పిస్తామని, సమాజంలో అంగన్‌వాడి అక్కా చెల్లెల గౌరవం పెంచే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శిశువు గర్భంలో ఉన్నప్పటి నుండి వారికి ప్రాధమిక స్థాయిలో విద్యా బుద్దులు నేర్పే వరకు అంగన్‌వాడి కార్యకర్తలు, ఆయాలే సంరక్షులుగా ఉంటున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రేపటి పౌరులను తీర్చిదిద్దే ఉత్తమ బాధ్యతలను నిర్వహిస్తున్న అంగన్‌వాడి సబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సచివాలయంలోని డిబ్లాక్‌ కాన్ఫరెన్సు హాలులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్‌వైజర్లతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడారు. దాదాపు మూడు గంటలకు పైగా వారితో వివిధ అంశాలపై చర్చించారు. వారి అభిప్రాయాలు, సమస్యలు ఓపికగా విన్నారు. కొన్ని అంశాల్లో వారి నుంచి సూచనలు, సలహాలు కూడా తీసుకున్నారు. అంగన్‌వాడి కేంద్రాల నిర్వహాణ, జీత భత్యాలు, ఆరోగ్య లక్షి అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తన అభిప్రాయాలు చెప్పారు. అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్ల వేతనాలు తప్పకుండా పెంచుతామని, పెంచిన జీతాన్ని కూడా మార్చి నెల నుండే చెల్లిస్తామని ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారు. అంగన్‌వాడి సూపర్‌వైజర్‌  పోస్టలన్నింటిని అంగన్‌వాడి కార్యకర్తలతోనే నింపుతామని ప్రకటించారు. కార్యకర్తలు, హెల్పర్ల విద్యార్హతలను బట్టి, వారి సర్వీసును పరిగణలోని తీసుకుని ఇతర ఉద్యోగాల్లో కేడా ప్రాధాన్యత కల్పిస్తమని సీఎం మాటిచ్చారు. విధ్యార్ధుల ఆలనా పాలనా తెలియడంతో పాటు చిన్న తనంలో విద్యా బోధన ఎలా చేయాలనే విషయంలో కూడా అంగన్‌వాడి ఉద్యోగులకు అపార అనుభవం ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే కెజి టు పీజి విద్యా విధానంలో వారిని భాగస్వాములు చేస్తమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం అంగన్‌వాడి సిబ్బందికి ప్రతి నెల జీతాలు రావడం లేదని, ప్రతినెలా జీతం వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంగన్‌వాడి కేంద్రాలకు గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలు విధిగా మంచినీళ్లు సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అంగన్‌వాడి సిబ్బందికి జీవిత భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తులు, ఇతర శాఖల ఉద్యోగులు చేసే పనులు కూడా అంగన్‌వాడి కార్యకర్తలే చేయాల్సి రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతున్నదని ముఖమంత్రి అన్నారు. వారి పని భారాన్ని తగ్గిస్తామని హామినిచ్చారు. అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్లకు అర్హతను బట్టి ఆసరా పెన్షన్లు, ఆహార భద్రతా కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంగన్‌వాడి కేంద్రాలలో వండే వంట కోసం కూరగాయంల వ్యయాన్ని పాల ధరను పెంచుతామని ముఖ్యమంత్రి హామినిచ్చారు. అంగన్‌వాడి కార్యకర్తలంగా తన అక్కా చెల్లెలతో సమానమని, వారికి సమాజంలో అదే గౌరవం దక్కేలా చూస్తమని ముఖ్యమంత్రి అభయమిచ్చారు. అంగన్‌వాడి నియామకాల్లో ఎవరైనా డబ్బులు డిమాండ్‌చేసినా, ఇతరత్రా వేధింపులకు పాల్పడినా తనకు నేరుగా సమాచారం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అంగన్‌వాడి కార్యకర్తలు గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విషయంలో చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ఆడపిల్లలను చంపే వారిని చట్టానికి అప్పగించాలని, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని బాగా అమలు చేయాలని, కళ్యాణలక్ష్మీ ద్వారా పేదలకు సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామస్థాయిలో అమలయ్యే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలును గమనించాలని, ప్రభుత్వానికి సమాచారం అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు.  ఈసమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య, ఐసిడిఎస్‌ డైరెక్టర్‌ విజయేంద్ర, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి జనార్ధన్‌రెడ్డి, ఇంటిజెన్స్‌ ఐజి శివధర్‌ రెడ్డి, ఐసిడిఎస్‌ జెడి సంధ్య, సిఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌  తదితరులు పాల్గొన్నారు.