అందరూ బడిలో ఉండాల్సిందే : వాణీమోహన
ఏలూరు, జూలై 17 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండడానికి వీలు లేదని దాడులు ముమ్మరం చేసి బాలకార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని జిల్లా కలెక్టర్ వాణీమోహన్ చెప్పారు. డిప్యూటీ లేబర్ కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్.కె. విశ్వానాథం మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలుసుకున్నారు. ఏలూరు ఏ,సీ,ఎల్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వి.వి లక్ష్మీలతో కలెక్టర్ బాలకార్మికుల విషయంపై సమగ్రంగా చర్చించారు. జిల్లాలో కార్మిక శాఖ అసలు పని చేయడం లేదని గతంలో అధికారుల నిర్లక్ష్యం భవిష్యత్తులో కనిపిస్తే సహించబోనని వాణీమోహన్ చెప్పారు. జిల్లాలో వేలాది మంది బాలలు బడిలో కాకుండా పనిలో ఉంటున్నారని అటువంటి వారందరనీ గుర్తించి వెంటనే ఆయా ప్రాంతాల్లోని హాస్టల్స్‌లో, బడిలో చేర్పించాలని 2013 నాటికల్లా బాలకార్మికులు లేని జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాను తీర్చిదిద్దేలా ఒక ప్రణాళిక రూపొందించుకుని ఇప్పటినుండే ప్రతీ రోజపు నివేదిక సమర్పించాలని కలెక్టర్ కార్మిక శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో బాలికల అక్రమ రవాణాను కూడా నిరోధించాలని, జిల్లాలో ఏ ఒక్కరూ కూడా వెట్టిచాకరీకి గురికాకుండా చూడాల్సిన బాధ్యత కార్మిక శాఖదేనని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు మండల తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారుల సహకారం తీసుకోవాలని వాణీమోహన్ సూచించారు. బాలకార్మికులు ఎక్కువగా ఫ్యాక్టరీల్లో, షాపుల్లో పనిచేస్తున్నారని అటువంటివాటిపై దాడు చేసి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్మిక శాఖ పనితీరును మెరుగుపరుచుకోకపోతే సంబంధిత అధికారుల తీరుపై రాష్ట్ర కార్మక శాఖ కమీషనర్ దృష్టికి తీసుకు వెళాతానని వాణీమోహన్ తెలిపారు.