అంబరాన్నంటిన తెలంగాణ సంబురాలు
ఊరువాడ ఒక్కటై జై కొట్టిన తెలంగాణ
జెండావిష్కరించిన సీఎం కేసీఆర్
జులైలో ఉద్యోగాల జాతర
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్,జూన్2(జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ప్రజల అభివృద్ది, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తొలి ఏడాదిలో చేపట్టిన పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ వివరిస్తూనే నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయాన్ని ప్రకటించారు. అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతనం మాట్లాడుతూ ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు,జులైలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. జులై నుంచే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టబోతున్నామన్నారు. పాలమూరు, నల్లగొండ జిల్లా కన్నీరు తుడవడానికి రూ.35వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం, రూ.30 వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్ట బోతున్నాం. ఈ సంవత్సరంలో 50 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడతామని సీఎం ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉంది. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పథకాలు దేశానికే ఆదర్శం. రూ. 28 వేల కోట్లు సంక్షేమానికే ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం మనది అని తెలిపారు. ఆవిర్భావ వేడుకలు కన్నులపండుగగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించామని అన్నారు. తెలంగాణ రాష్టాన్న్రి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని, దామరచర్ల, కొత్తగూడెం, మణుగూరులో విద్యుత్ ప్లాంట్లు, నల్లగొండలో అల్టామ్రెగా పవర్‌ప్లాంట్ సాకారం కాబోతోందన్నారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందన్న వారికి ఇదే సమాధానమన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ద్యేయమన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రూ.28వేల కోట్లు సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం మనదని తెలిపారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినం. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినం. ఆర్టీసీని అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దుతం. అవసరమైతే ప్రభుత్వమే గ్రాంట్ ఇచ్చి ఆదుకుంటుందన్నారు. అంగన్‌వాడీ, ¬ంగార్డులకు జీతాలు పెంచినం. మైనార్టీ, గిరిజనుల రిజర్వేషన్లపై కమిటీలు వేసినం. రైతులకు రూ.17వేల కోట్ల పంట రుణమాఫీ చేసినం. రూ.400 కోట్లతో పోలీస్ వ్యవస్థ అధునీకరణ చేసినం. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్ ఆధ్వర్యంలో అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. రూ.20 వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ వస్తే కష్టాలేనని తప్పుడు ప్రచారం చేశారని, ఆరేడు నెలల్లోనే విద్యుత్ కష్టాలను అధిగమించామని తెలిపారు. రూ.91వేల కోట్లతో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామన్నారు. 2018 నాటికి తెలంగాణలో నిరంతర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ మరో అద్భుతమైన కార్యక్రమం అంటూ 46వేల చెరువులకు పూర్వవైభవం తెస్తాం. 300 కోట్ల మొక్కలను పెంచాలన్న ఉద్దేశంతో హరితహారం నిర్వహిస్తున్నాం. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అంతకు ముందు కేసీఆర్ గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు డీజీపీ అనురాగశర్మ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అమరవీరులకు అంజలి ఘటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా ప్రాంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంత్రులుపతకావిష్కరణ చేశారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నేతి విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.పరేడ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పరేడ్ మైదానంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కవాతు, శకటాల ప్రదర్శనలు కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా జిల్లాలో ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేయగా, మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కమిషనర్ సోమేష్‌కుమార్, అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి హరీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఆదిలాబాద్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంత్రి జోగురామన్న అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. వరంగల్ హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి జెండా ఆవిస్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. కరీంనగర్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అమరువీరుల స్థూపానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో మంత్రి ఈటెల గౌరవవందనం స్వీకరించారు. గోదావరిఖని బొగ్గు గనుల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరవీరులకు సింగరేణి కార్మికులు నివాళులర్పించారు. నల్గొండలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్ కొత్తబ్రిడ్జిపై సంబరాలు నిర్వహించారు. పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.