అంబేద్కర్‌ కేవలం విగ్రహం మాత్రమే కాదు


అంబేద్కర్‌ విగ్రహాలపై దాడులు భూ స్వామ్య, అగ్రకుల, అప్రజాస్వామిక సంస్కృతి స్వభావాన్ని ప్రతిఫలిస్తాయనీ, చర్చ దాని పైన జరగాలనీ అంటున్నారు కె సత్యనారాయణ
ఈ జనవరి 22 రాత్రి అమలాపురం, పట్టణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ద్వంసం చేసి, నూతిలో, కాల్వలో పడవేసి దాడులుగా అవమానించిని దరదృష్టకర సంఘటన రాష్ట్ర వ్యాప్త నిరసనలకు, చర్చకు దారితీసింది. దళిత సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ చర్యని ఖండిచాయి. గొప్ప ప్రజాస్వామికవాది, దార్శనికుడు, మేదావి అయిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌పై దాడి ఘటన మన సమాజపు భూస్వామ్య , అగ్రకుల స్వభావం గురించి, అప్రజాస్వామిక సంస్కృతి గురించి అర్థం చేసుకొవడానికి తోడ్పడుతుంది. ఈ హేయమైన చర్య అంబేద్కర్‌ జౌన్నత్యాన్ని ఏ మాత్రం తగ్గించదు.
ప్రజాస్వామికశక్తులు ఈ దాడిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసాయి. దళిత సంఘాలు, విద్యార్ధి సంస్థలు, ఆర్‌పిఐ, టిఆర్‌ఎస్‌, సిపిఐ (ఎం), టిడిపి లాంటి రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు దోషులను గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాలు, ర్యాలీలు తీసాయి. జనవరి 29న రిసబ్లికన్‌ పార్టీ ఆప్‌ ఇండియా, స్థానిక బహుజన సమాజ్‌ పార్టీ, దళిత స్త్రీ శక్తి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాలు, స్వఛ్చంద సంస్థలు, అంబేద్కర్‌ యువజన సంఘాలు సంయుక్తంగా చలో అమలాపురం కార్యక్రమానికి పులుపినిచ్చాయి. జనవరి 29న మధ్యాహ్నం అమలాపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఈ సఢకు అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేశారు. చలో అమలాపురం కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి అగ్రకుల రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వం వారి తొత్తులైన కొందరు దళిత నేతలతో కలిసి కుట్రపన్నారు. 28 రాత్రి నుంచి అమాలాపురంలోకి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. అమలాపురం వెళ్లే వాహానాల్ని ఆపి, ప్రజల్ని దింపేశారు. 29 మధ్యాహ్నం వరకు అమలాపురం వెళ్లాల్సిన వాహనాల్ని ఎక్కడికక్కడే నిలిపివేశారు. కాలి నడకన వచ్చిన కార్యకర్తలు ఏదో రకంగా అమలాపురం బుద్ద విహార్‌ ప్రాంతం చేరుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఆర్‌పిఐ అధ్యక్షులు, దళిత నాయకులు తారకం, ఎంఎల్‌సి జూపూడి ప్రభాకర్‌ రావు, దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కన్వీనర్‌ గెడ్డం ఝూన్సీ, టిడిపి నాయకులు గొల్లపెల్లి సూర్యారావు తదితరుల్ని అక్రమంగా అరెస్టు చేశారు. లాఠీచార్జ్‌ జరిపి జనాల్ని తరిమేశారు. అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసం ఘటనపై, కనీసం ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు కాలరాసి, తీవ్ర నిర్భంధాన్ని ప్రభుత్వం అమలు చేసింది.
జనవరి 30న అంబేద్కర్‌ విగ్రహాలపై దాడులకు నిరసనగా రాష్ట్ర బంద్‌ పాటించాలని తెలంగాణ విద్యార్ది ఐక్య కార్యాచరణ కమిటీ (జెఏసి) టిడిపి పార్టీలు, వివిథ ప్రజాసంఘాలు, దళిత సంఘాలు ఈ బంద్‌కి మద్దతు తెలిపాయి.
అంబేద్కర్‌ విగ్రహాలపై దాడులక గల నేపధ్యం, కారణాల గురించి పోలీసులు, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు పలురకాలుగా వ్యాఖ్యానించాయి. పోలీసుల కథనం, ప్రభుత్వ స్పందన పరిశీలిస్తే ప్రభుత్వ వైఖరి మనకు అర్థమవుతుంది. ఈ దాడికి బాధ్యుల్ని గుర్తించామనీ, పట్టుమని ఇరవై ఏళ్లు కూడా లేని ముగ్గుర్ని పత్రికల ముందు ప్రవేశపెట్టి, పోలీసులు తమ కథనాన్ని నిందితుల ఒప్పుకోలు ప్రకటన రూపంలో బయటపెట్టారు. ఈ కథనం ప్రకారం జనవరి 22న రాత్రి కొందరు యువకులు, రౌడీలు మందుపార్టీ చేసుకున్నారు. తిరగి వెళ్లే సమయంలో ఎస్‌కెబిఆర్‌ కాలేజీ సమీపంలో మహేశ్‌బాబు ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. తరువాత బండివారిపేటలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పడేశారు. రోళ్లపాలెం, చిందాడతరుమ ప్రాంతాలలోని విగ్రహాల్ని కాల్వలోనూ, నూతిలోనూ పారవేశారు. నల్లవంతెన దగ్గర అంబేద్కర్‌ విగ్రహం చెయ్యి విరగోట్టారు. ఈ మొత్తం చర్కలన్నీ మద్యం తాగిన మత్తులో తాము చేసిన ఆకతాయి పననులని ఈ నిందితులు పోలీసుల ముందు ఓప్పేసుకున్నారు. ఒక నూతిలో పడవేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా వారు పోలీసులకు చూపించారు. కథ చెప్పి, పోలీసులు ఎవరినో కొందర్ని పట్టుకొని నాలుగు తన్ని కథలు చెప్పించడంలో దిట్టలని తెలిసిన వారెవరూ ఈ కథనాన్ని నమ్మరు. పూర్తిస్థాయి విచారణ, సాక్షాధారాల సేకరణ లేకుండా కేవలం నిందితుల ఒప్పుకోలు ప్రకటన ఆధారంగా దాడుల వెనుక కుట్ర లేదని పోలీసులు చెప్పడం సబబు కాదు. చట్టబద్దం కూడా కాదు. ఇది కేవలం ప్రభుత్వానికి వంత పాడడమే అవుతుంది.
ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన కూడా అన్యాయంగా ఉంది. అంబేద్కర్‌ విగ్రహాలపై దాడికి బాధ్యులను గుర్తించడం, శిక్షించడం అనే విషయాన్ని పక్కనపెట్టి, ఇకముందు విగ్రహాలు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి అసవరమని, విగ్రహాలకు రక్షణ విషయం ఆలోచిస్తున్నామని ప్రకటించింది. అనుమతి లేకుండా పెట్టిన విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని, విగ్రహాలు పెట్టకపోతే ఈ గొడవలే ఉండవు కదా అనే రీతిలో ప్రభుత్వ వాదన ఉంది. అంబేద్కర్‌ విగ్రహాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. ఈదాడుల్ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలో అంత సీరియస్‌గా ప్రభుత్వం తీసుకోలేదు. అంబేద్కర్‌ విగ్రహం, మిగతా విగ్రహాల్లాగా కేవలం విగ్రహాం మాత్రమే కాదు. ఒక ఆత్మగౌరవ ఆకాంక్షల్ని, చైతాన్యాన్ని పోరాటాల్ని సహించని భూస్వామ్య శక్తులు, కుల దురహంకార శక్తులు చేసిన దాడుల్ని ప్రజాస్వామిక విలువలపై చేసిన దాడిగా గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది. పోలీసుల ద్వారా కట్టుకథలు చెప్పించి, సమగ్రమైన విచారణకు ఆదేశించకుండా ప్రభుత్వం ఈ దాడుల వెనుకనున్న పాలకపార్టీ, ఆగ్రకుల భూస్వామ్య శక్తుల పాత్రని వెలుగులోకి రాకుండా చేసింది.