ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..

` ముగ్గురు మావోయిస్టులు మృతి
కాంకేర్‌(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాంకేర్‌, గరియాబంద్‌ జిల్లాల సరిహద్దులోని రావాస్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డీఆర్‌జీ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి ఇరువైపుల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో మావోయిస్టుల ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. కాల్పులు ముగిసిన తర్వాతే మృతులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుత ఆపరేషన్‌తో కలిపి.. ఈ ఏడాది చత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 252 మంది మావోయిస్టులు హతమయ్యారని తెలిపారు.