శాంతించిన మూసీ
` – సాధారణ స్థితికి చేరిన ప్రవాహం
– పునరావాస కేంద్రాల నుంచి సొంతింటికి బస్తీ వాసులు
` ప్రారంభమైన ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్‌ను హడలెత్తించిన మూసీ నది ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది. మూసీ నది పరివాహకంలోని చుట్టు పక్కల ఉన్న బస్తీల ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి సొంతిళ్లకు చేరుకుంటున్నారు. వరదలో మునిగిన తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోని సామగ్రి, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. చాదర్‌ఘాట్‌లో లెవల్ వంతెనపై భారీగా బురద, చెత్తా చెదారం పేరుకుపోయింది. మూసారాంబాగ్ వద్ద లోయర్ బ్రిడ్జిపైనా మూసీ వరద సృష్టించిన బీభత్సం కళ్లకు కడుతోంది. చాదర్ ఘాట్ బ్రిడ్జి రెయిలింగ్ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోగా, అధికారులు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. మూసారాంబాగ్ వద్ద సైతం ఇదే పరిస్థితి ఉండగా పెద్ద ఎత్తున మరమ్మతులు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల పర్యటించారు. శానిటేషన్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉప్పల్ భగాయత్ సమీపంలో మూసీ ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. వాటర్ ప్రెజర్‌తో క్లీనింగ్ చేయిస్తూ దోమలు, అంటువ్యాధుల నివారణకు శానిటేషన్ చేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలు మురికిలోనే ఉన్నాయి. శనివారం మూసీ వరదలో చిక్కుకున్న ఎంజీబీఎస్ తేరుకుంది. బస్టాండ్ ఆవరణలో పేరుకుపోయిన బురదను పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టి తిరిగి ఆర్టీసీ బస్సు సేవలను అధికారులు ప్రారంభించారు. ప్రయాణికులు ఎవరూ ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. బస్టాండ్?లో వరద కారణంగా శనివారం ఊర్లకు వెళ్లలేకపోయినా ప్రయాణికులు, తాజా సర్వీసులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. దసరా పండక్కి ఊరెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కళకళలాడుతోంది
మూసీ నదికి 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం :
శనివారం కురిసిన వర్షానికి మూసీ నదికి ఒకేసారి 35 వేల క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భారీ వరద ముంచెత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అంతా బిక్కుబిక్కుమన్నారు. ఉస్మాన్‌సాగర్ 12, హిమాయత్‌సాగర్ 9 గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కులకు పైగా నీరు మూసీ నదిలోకి వరద నీటిని విడుదల చేశారు. దీంతో ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు అన్నీ నీట మునిగాయి.ఈ ప్రభావం బాపూఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసానగర్, రసూల్‌పురా, వినాయక వీధి, శంకర్‌నగర్‌లలో వందల ఇళ్లు నీట మునిగి నానా ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వరద ప్రవహించే క్రమంలో మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహించింది. వంతెనపై స్లాబ్? వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంట్రింగ్? భారీ శబ్దాలతో కొట్టుకుపోయింది. ఇప్పుడు కాస్త మూసీ నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో జనాభాలు ఒక్కొక్కరు సొంతిళ్లకు వెళుతున్నారు.