చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
` మావోయిస్టులతో కాల్పుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం
` కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి):ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. భద్రతాదళాలు వారిపై ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించబోవని హామీ ఇచ్చారు. దిల్లీలో ‘నక్సల్ రహిత భారత్’పై నిర్వహించిన సెమినార్ ముగింపు సమావేశంలో ఆయన ఈమేరకు ప్రసంగించారు.‘‘గందరగోళం సృష్టించేందుకే మావోయిస్టుల నుంచి ఇటీవల ఓ లేఖ బయటకు వచ్చింది. ఇప్పటివరకు జరిగింది పొరపాటు అని, కాల్పుల విరమణ ప్రకటించాలని, తాము లొంగిపోవాలనుకుంటున్నామని అందులో పేర్కొన్నారు. ఒకవేళ మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే.. కాల్పుల విరమణ అవసరం లేదు. ఆయుధాలను వీడి ముందుకు రండి. ఒక్క బుల్లెట్ కూడా పేలదు. రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతాం. పునరావాసం కల్పిస్తాం’’ అని అమిత్ షా తెలిపారు. అభివృద్ధి లేకపోవడమే మావోయిస్టు హింసకు దారితీసిందనే వామపక్షాల వాదనలను తోసిపుచ్చారు. ఈ హింస కారణంగానే దేశంలోని అనేక ప్రాంతాలు దశాబ్దాల తరబడి అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయన్నారు.
మావోయిస్టుల్లో తీవ్ర విభేదాలు!
‘‘దేశంలో నక్సలిజం సమస్య ఎందుకు తలెత్తింది? వారికి సైద్ధాంతిక, ఆర్థిక, చట్టపరమైన మద్దతును ఎవరు అందిస్తున్నారు? వీటన్నింటినీ అర్థం చేసుకోనంత వరకు.. నక్సలిజంపై పోరాటం ముగియదు. మావోయిస్టుల హింసపై మౌనం వహించిన వామపక్ష పార్టీలు.. ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను ప్రారంభించినప్పుడు మాత్రం మానవ హక్కుల గురించి మాట్లాడటం ప్రారంభించాయి. మావోయిస్టులను ఆ పార్టీలు ఎందుకు రక్షించాలి? గిరిజన బాధితుల హక్కులను కాపాడేందుకు నక్సల్ సానుభూతిపరులు ఎందుకు ముందుకు రారు?’’ అని అమిత్ షా ప్రశ్నించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని పునరుద్ఘాటించారు.