అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
` భారత పుత్రికలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు..
` మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
న్యూఢల్లీి(జనంసాక్షి):‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం స్వదేశీ తయారీ ఉత్పత్తులే విక్రయించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన్‌కీ బాత్ 126వ కార్యక్రమంలో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలంతా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి.. ధరించాలని కోరారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వదేశీ ఉత్పత్తులపై మహాత్మా గాంధీ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించారన్నారు. కాలక్రమంలో ఖాదీకి ప్రజాదరణ క్షీణించినప్పటికీ.. గత 11 ఏళ్లుగా మళ్లీ ఖాదీ ఉత్పత్తి పెరిగిందని అన్నారు.ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను, అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో మిగతా దేశాల మాదిరిగానే మనం కూడా సొంత ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి దీనిపై దేశవ్యాప్త విప్లవానికి నడుం బిగించాలని, కేవలం భారతీయులు తయారుచేసిన వస్తువులనే కొనుగోలు చేయాలన్నారు. భారత నావికాదళానికి చెందిన ఇద్దరు అధికారిణులు, లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపల ధైర్య సాహసాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. సముద్ర గర్భంలో వారు చూపుతున్న తెగువను కొనియాడారు. భారత పుత్రికలు కఠినమైన పరిస్థితులను సైతం సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారన్నారు. మన్‌కీ బాత్‌లో భాగంగా వారిరువురితో ఫోన్‌లో సంభాషించారు.స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్ భారతరత్న, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ల జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ ఉరికంబం ఎక్కారని..దానికి ముందు ఆయన ఆంగ్లేయులకు లేఖ రాశారని అన్నారు. ఇందులో తమను ఉరి కంబాలకు బదులు తూటాలతో చంపాలని భగత్‌సింగ్ కోరినట్లు తెలిపారు. ఆ లేఖ ఆయన సాహసానికి నిదర్శనమని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భగత్ సింగ్ ఎప్పుడూ ముందుండే వారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన దేశభక్తి గీతాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నారు. భారతీయ సంస్కృతి, సంగీతంపై ఆసక్తి ఉన్న ఎవరైనా ఆమె పాటలను విని మంత్రముగ్ధులైపోతారని కొనియాడారు.