అకాలవర్ష బాధితులను ఆదుకోండి
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
పంట నష్టంపై ఆరా
ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్,ఏప్రిల్13(జనంసాక్షి): వర్షాలకారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వర్షాల వల్ల మృతి చెందినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. జిల్లాలవారీగా మృతుల వివరాలు, ఆస్తినష్టంపై నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలపై సోమవారం సిఎం సచివాలయంలో ఉన్నతస్థాయి సవిూక్ష చేశారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను,పశువులు కోల్పోయిన వారిని, ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. బాధితులను ఆదుకోవడంతోపాటు పిడుగుపాటు, వడగండ్లు, భారీ వర్షాల వలన మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతేకాకుండా జిల్లాల వారీగా జరిగిన నష్టాల వివరాలను పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ సవిూక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం, మంత్రి హరీష్ రావు,సీఎస్ రాజీవ్ శర్మ, రెవెన్యూ కార్యదర్శి విూనా పాల్గొన్నారు. విపత్తుల సమయంలో తక్షణ సాయం అందించేలా అధికారులు చర్య తీసుకోవాలన్నారు. వచ్చే 48 గంటల్లో తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు. క్యుములో నింబస్ మేఘాలతో భారీ వర్షాలు పడుతున్నాయని, తేమ, వేడి కారణంగా ఈ మేఘాలు ఏర్పడుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 7సెం.విూ., ఆదిలాబాద్‌లో 4, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండల్లో 2-3 సెం.విూ., కడప, అనంతపురం జిల్లాల్లో 7 నుంచి 10 సెం.విూ. వరకు వర్షపాతం నమోదైంది. తెలంగాణలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా, వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో పంట నష్టం అధికంగా ఉంది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో తగిన చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. బాధితులను ఆదుకునే విషయంలో మానవత్వంతో వ్యవహరిస్తామన్నారు. అకాల వర్షాల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. జిల్లాల వారిగా పంట, ఆస్తి నష్టం వివరాలను తక్షణమే సేకరించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాల కారణంగా జరిగిన నష్టాలపై విపత్తు నిర్వహణ శాఖ నివేదిక సమర్పించింది. వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో ఇద్దరు, మహబూబ్‌నగర్‌లో ఒకరు మృతిచెందారు. కరీంనగర్ జిల్లాలో 55 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పంట నష్టం వివరాలను కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,366 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొన్నారు. వరి- 7,442, మొక్కజొన్న- 602, జొన్న 336, నువ్వులు- 5,262, సజ్జలు- 1,708, శనగ- 10 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల రాష్ట్రంలో సుమారు 15 వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని, కరీంనగర్లో 55 ఇళ్లు ధ్వంసమైనట్లు చెప్పారు. అత్యధికంగా పదివేల హెక్టార్లకు పైగా పంటనష్టం వాటిల్లగా ఇందులో నల్లగొండలో మూడు హెక్టార్లలో, కరీంనగర్లో ఆరు, మహాబూబ్నగర్ మూడు పశువులు మృతి చెందినట్లు తెలిపారు. జిల్లాలో పంట, ఆస్తి నష్టం వివరాలను త్వరగా పంపాలని తెలంగాణ విపత్తు నివారణశాఖ ఆదేశించింది. వరి, మామిడి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, పసుపు, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాలపై విపత్తు నిర్వహణ శాఖ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.వర్షం కారణంగా వాణిజ్యపంటలతోపాటు కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా పలు జిల్లాల్లోని రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ , నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అకాల వర్షాలు తీవ్రం ప్రభావం చూపాయి. దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా. కోట్లలో ఆస్తి నష్టం ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.