అకాల వర్షంతో అన్నదాత కుదేలు

4

సర్కారు ఆదుకోవాలని వేడుకోలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి):తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు అపారనష్టాన్నే మిగిల్చాయి. హైదరాబాద్‌లోనూ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ నాలాలు ఉప్పొంగడంతో ఇళ్లలోకి నీరు వచ్చిచేరింది. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో పంటల దెబ్బతిన్నాయి. చేతకొచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. కోతకొచ్చిన వరిపైరు నేలకొరిగింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. మొత్తానికి అకాల వర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచాయి. లక్షల్లో నష్టాలను మిగిల్చాయి. పంటనష్టంతో కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో ఓ రైతు ఆత్మహత్యచేసుకోవడం పలువురిని కలచివేసింది. కరీంనగర్‌ జిల్లాలోనూ అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. వేల ఎకరాల్లో వరి, మామిడి, నువ్వు, సజ్జ, పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాలలో మామిడి, అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అయితే అధికారులు పంట నష్టాన్ని సరిగా సర్వే చేయడం లేదని రైతులు ఆరోపించారు. హుజూరాబాద్‌లో కల్లాల్లోని వరిధాన్యం పూర్తిగా తడిసిపోయింది.ఆదిలాబాద్‌జిల్లా అన్నదాతలను అకాలవర్షాలు నిండాముంచాయి. వరి, మామిడితోపాటు, సజ్జ, జొన్న, మిర్చి, నువ్వులు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. లోకేశ్వరం, దిలావర్‌పూర్‌, కుంటాల, నిర్మల్‌, లక్ష్మణచాంద, మామడ, బోథ్‌, నేరెడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, ఉట్నూర్‌ తదితర మండల్లాల్లో పంటనష్టం తీవ్రంగా జరిగింది. మార్కెట్‌ యార్డులకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.అకాల వర్షాలకు వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో మామిడి, వరి పంటలు నాశనమయ్యాయి. పరకాల మార్కెట్‌యార్డులో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. చేర్యాలలో వరిపంటతో పాటు.. కూరగాయ తోటలు దెబ్బతిన్నాయి. ఏటూరు నాగారం ఏజెన్సీలో మిర్చీ పంట తీవ్రంగా దెబ్బతింది. కల్లాల్లో ఎండపోసిన మిర్చీ తడిసి పోయింది. కవర్లు, టార్పాలిన్లు కప్పినా ఫలితం లేకపోయింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గాలివానకు మామిడి కాయలు రాలిపోయాయి. వరి పంట నేలకొరిగింది. కోదాడ, భువనగిరి, మిర్యాలగూడ, తుంగతుర్తి, సంస్థాన్‌నారాయణపురం, చివ్వెంల, నకిరేకల్‌ మండలాల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. భువనగిరి మార్కెట్‌ యార్డుకు తెచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. మిర్యాలగూడలోనూ కల్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పాలమూరు జిల్లా రైతులను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వేల ఎకరాల్లో మామిడి, వరి, వేరుశనగ, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. అజిలాపూర్‌ పంచాయతీ శివారులోని కమ్మరిగడ్డ తండాకు చెందిన సక్రూబాయి పిడుగుపాటుకు మృతిచెందింది. మంగల్‌పల్లిలో ఇటుకబట్టీలు కరిగిపోయాయి. చేతికివచ్చిన పంటలు సర్వనాశనం కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు. ఖమ్మం జిల్లా వైరాలో అకాల వర్షాలకు మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వైరా మార్కెట్‌యార్డ్‌కు తెచ్చిన మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోయాయి.