అకాల వర్షంతో తెలంగాణలో భారీ పంట నష్టం

4

హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి): అకాల వర్షాలు మరోమారు రైతు నెత్తిన పిడుగులా పడ్డాయి. తెలంగాణలో కురిసిన అకాల వర్షం కారణంగా కొన్నిచోట్ల భారీ పంటనష్టం వాటిల్లింది. ఎండలతో మండుతున్న జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ అకాల వర్షంతో పెద్దగా ఆస్తుల నష్టం లేకపోయినా పంటలు మాత్రం నష్టపోయాయి. ఆయా ప్రాంతాల్లో పండిస్తున్న పసుపు, మిర్చి, గోధుమ, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఆరబోసినపంటలకు నష్టం వాటిల్లింది. అకస్మాత్తుగా ప్రారంభమైన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. చలినుంచి తేరుకుని ఎండలు మొదలైన తొలినాళ్లలోనే అకాల వర్షంతో వాతావరణం చల్లబడింది.  ఆదిలాబాద్‌లో 18 మి.విూ, ఇచ్చోడలో 13.6 మి.విూ, నేరడిగొండలో 12.4 మి.విూ, గుడిహత్నూర్‌ 12.2 మి.విూ, ఖానాపూర్‌ 4.6 మి.విూ, ఇంద్రవెల్లి 4.0 మి.విూల వర్షపాతం నమోదైంది. భైంసాలో 57 మి.మి వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా లక్ష్మణచాంద, బేల మండలాల్లో 2.4 మి.మి. నమోదైంది. అదిలాబాద్‌ జిల్లాతోపాటు నిజామాబాద్‌ జిల్లాలో ఎక్కువగా పంట నష్టం వాటిల్లింది. కాగా పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని ఆయన పరిశీలించారు. ఇప్పటికే అకాల వర్షంతో నష్టపోయిన రైతుల వివరాలతో నివేదికలు అందజేయాల్సిందిగా ప్రభుత్వం తరపున అధికారులను ఆదేశించామన్నారు.