అకాల వర్షం అపార నష్టం

1

హైదరాబాద్‌, మార్చి1(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించింది. రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడమే కాక రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని ముధోల్‌లో 5 సెం.మీ., మద్నూరు, మోమిన్‌పేట్‌, తాండూరుల్లో 4 సెం.మీ., బోధ్‌, కోటగిరి, రామరాయిగెడ్డ, ఎడపల్లి, జుక్కల్‌లో 3 సెం.మీ., రుద్రూర్‌, బోధన్‌, నారాయణ్‌ఖేడ్‌, కొడంగల్‌లో 2 సెం.మీ., ఎల్లారెడ్డి, ఆర్మూరు, నిర్మల్‌లో ఒక సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా వర్షం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజామాబాద్‌ పర్యటన రద్దయింది. పలు ప్రాంతాల్లో జొన్న, పసుపు తదితర పంటలు ఎండబెట్టిన రైతులను అకాల వర్షం ముంచేసింది. అకాల వర్షం కారణంగా పంట నష్టం తీవ్రంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.