అకాల వర్షాలతో తెలంగాణ అతలాకుతలం

5

భారీగా పంట నష్టం

హైదరాబాద్‌, ఏప్రిల్‌12(జనంసాక్షి) : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్దింది. లక్షద్వీప్‌ నుంచి తెలంగాణ మీదుగా గుజరాత్‌ వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. రంగారెడ్డి, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలో భారీ వర్షానికి వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లా భువనిగిరి డివిజన్‌లోని మర్రిగూడ, నారాయణపురం మండలాల్లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐకేపీ కేంద్రంలో నిల్వచేసిన ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షానికి మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరులో జడ్పీ పాఠశాల భవనం కుప్పకూలింది. పాఠశాలలలోని 15 కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. రాత్రి సమయంలో పాఠశాల భవనం కూలడంతో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం వీరన్నగుట్టతండాలో ఇంటి పైకప్పు కూలి మహిళ మృతిచెంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వర్షం, ఈదురుగాలులకు మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్‌ నగరంలోని ఎస్‌ఆర్‌తోట వద్ద భారీ వర్షం, ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు ఇంటిపై తెగిపడటంతో దంపతులు మృతిచెందారు.

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌ నగరంలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకపూల్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక, సికింద్రాబాద్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు, నాలాలు సక్రమంగా ఉండేలా జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వర్షపు నీటితో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.