అక్రమార్కుల భరతం పట్టే అవకాశం వచ్చింది
పనామా పత్రాల్లో 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్లుగా వెల్లడైన నేపథ్యంలో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనా, ఐటి శాఖపైనా ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకునే ప్రయత్నం చేయాలి. ఇదో అవకాశంగా తీసుకుని పన్ను ఎగవేతదారుల పనిపట్టాలి. అంతేగాకుండా బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగవేసిన వారి పనీ పట్టాలి. ఓ రకంగా ఇది అందివచ్చిన అవకాశంగా తీసుకుని కేంద్రం చురుకుగా వ్యవహరిస్తే ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పిన వారు అవుతారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హావిూని మోడీ ఎలాగూ నెరవేర్చలేకపోయారు. బ్యాంకులకు పెద్ద ఎత్తున రుణాలు ఎగ్గొట్టిన వారినీ ఏం చేయలేకపోయారు. మాల్యాలాంటి వారు దేశం విడిచిపెట్టి పోతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోయారు. రుణ ఎగవేత కేసులు ఎదుర్కొంటున్న సుజనా చౌదరిని మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారు. బ్యాకులను మోసం చేసి రుణాలను ఎగవేసిన కావూరి సాంబశివరావును అధికార బిజెపిలో అక్కున చేర్చుకున్నారు. దాదాపు పదివేల కోట్లను వసూలు చేసి ప్రజలకు టోపీ పెట్టిన ఎపిలోని అగ్రిగోల్డ్ సంస్థ కార్యకలాపాలపై పెద్దగా చర్య తీసుకోలేకపోయారు. కనీసం పనామా వెల్లడించిన పేర్ల జాబితాను పరిశీలించి వారిపైన అయినా చర్య తీసుకునే ప్రయత్నం చేయాలి. గత రెండేళ్లుగా మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే రుణాలు, పన్నుల ఎగవేత దారులకు ధైర్యం వచ్చింది.. ఓ బహుళ సంస్థల దర్యాప్తు బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందని, విదేశాల్లో అక్రమ ఖాతాలను కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించినా విశ్వసనీయత లేని వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయి. పనామా పత్రాల అంశంపై ప్రధాని మోదీ తనతో మాట్లాడారని, ఆయన సూచన మేరకు.. ప్రత్యక్ష పన్నుల కేంద్రబోర్డు (సీబీడీటీ), ఆర్‌బీఐ, ఆర్థిక నిఘావిభాగం (ఎఫ్‌ఐయూ), విదేశీ పన్ను, పన్ను పరిశోధన (ఎఫ్‌టీటీఆర్)లతో కూడిన ఒక దర్యాప్తు బృందాన్ని నియమించామన్నారు. పత్రాల్లో వెల్లడైన ఖాతాలను ఈ సంఘం నిరంతరం పర్యవేక్షిస్తుందని, చట్టవ్యతిరేకంగా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరికొన్ని రోజుల్లో మరిన్ని పేర్లు బయటికిరావచ్చన్నారు. పనామా పత్రాల లాంటి పరిశోధనలు మరిన్ని జరగాలని, వీటిని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. అయితే ఇలా ఓ సంఘం ఉందని చెప్పి తప్పించుకుంటే ప్రజలు క్షమించరని గుర్తుంచుకోవాలి. విచారణ అన్నది వేగంగా జరగాలి. ప్రజలకు నమ్మకం కలిగేలా కఠినగా ఉండాలి. ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పగలగాలి. ఆసల్యం జరగదని నిరూపించాలి. ఎందుకంటే ఈ తరహా విచారణలో గత రెండేళ్లుగా ఎలాంటి పురోగతి లేకపోవడం వల్లనే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. ప్రస్తుత జాబితా విషయంలో అన్ని వర్గాల నుంచి వీలైనంత ఎక్కువ సమాచారం రాబట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని జైట్లీ అన్నారు. నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ప్రభుత్వం గతేడాది ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోని వారు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. నల్లధనానికి కళ్లెం వేసేందుకు సిద్ధంచేసిన నూతన నల్లధన నిరోధక చట్టంలోని కఠిన నిబంధనల కింద ప్రస్తుత జాబితాను విచారించనున్నట్లు వెల్లడించారు. అయితే మాటలతో కాలం నడవదని జైట్లీ గుర్తుంచుకోవాలి. మాల్యాను హెచ్చరించినా ఎలాంటి పురోగతి లేదు. అలాగే రుణాల ఎగవేతదారుల జాబితా ఆర్‌బిఐ వద్ద ఉంటుంది. కనీసం ఆ జాబితాను ఎందుకు వెల్లడించలేకపోతున్నారో చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా బ్యాంకులే వీధిలో పడి రుణాల వసూళ్లకు ఉద్యమిస్తున్న తీరు చూస్తున్నాం. ఈ దురవస్థకు కారణం రాజకీయ జోక్యం తప్ప మరోటి కాదు. రాజకీయంగా అధికారంలో ఉన్న వారు అండగా నిలవడం వల్లనే బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. మనదేశంలో ఎందరో రుణ ఎగవేతదారులు ఉన్నారు. ఎందరో ఆదాయపన్ను కట్టని వారున్నారు. వారి గురించి ఏనాడు కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. చివరకు మోడీ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల లాగానే అవినీతి పరులను వెనకేసుకుని వస్తోంది. పనామా పత్రాల ఆధారంగా అనేకమంది ప్రపంచ నేతలు, వివిధ రంగాల ప్రముఖుల నల్ల జాతకాలు బట్టబయలయ్యాయి. సుమారు 140 మంది రాజకీయ ప్రముఖులు వేర్వేరు చోట్ల సంపాదించిన ఆస్తిపాస్తుల బండారం బట్టబయలయింది. పన్నులు చెల్లించకుండానో, ఇతరత్రా అక్రమ మార్గాల్లోనో వందల వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్న పెద్ద మనుషుల్లో కనీసం 500 మంది భారతీయులు ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి. గతంలో వికీలీక్స్ ఎంత సంచలనం సృష్టించిందో అంతకంటే ఎక్కువ ప్రకంపనలు ఇప్పటికే మొదలయ్యాయి. భారత్‌లోనూ కుబేరుల జాబితా తక్కువేవిూ కాదు. కనీసం 500 మంది ఉన్నారనే సమాచారం ఉలికిపాటు కలిగిస్తోంది. యావత్‌దేశం అభిమానంతో బిగ్‌బీగా పిల్చుకునే అమితాబ్‌బచ్చన్, ఆయన కోడలు, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్‌ల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటం కలవరానికి గురిచేసింది. వీరితోపాటు స్థిరాస్తి వ్యాపార రంగంలో దిగ్గజాలుగా పేరున్న డీఎల్‌ఎఫ్ అధిపతి పీకేసింగ్, ఇండియాబుల్స్ అధిపతి సవిూర్ గెహ్లాట్, అపోలో టైర్స్ ఛైర్మన్ ఓంకార్ కన్వర్ తదితరులు ఉన్నారు. వీరందరిపైనా నిజాయితీగా విచరాణ జరిపే ధైర్యం ఉందా అన్నది ఎన్‌డిఎ సర్కార్ ఆలోచన చేయాలి. తమది చేతల ప్రభుత్వంగా నిరూపించుకోవాలి. ఇదో అవకాశంగా భావించి అడుగు ముందుకు వేస్తే నల్లకుబేరులను ఇట్టే పట్టేయవచ్చు. ఆ దిశగా మోడీ సర్కార్ అడుగుల వేస్తే ప్రజలు ఆదరిస్తారు.