అక్రమాస్తుల కేసులో జయ నిర్దోషి

C

– కేసులన్నీ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

– జయ స్నేహితురాలు షశికలతో సహా ముగ్గురికి విముక్తి

– తమిళనాట అంబరాన్నంటిని సంబరాలు

– ప్రముఖుల అంబరాన్నంటిన సంబరాలు

బెంగుళూరు/చెన్నై,మే 11 (జనంసాక్షి):  జయలలిత అక్రమాస్తుల కేసులో కర్నాటక హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. జయపై ఉన్న అన్నీ కేసులను రద్దు చేస్తున్నట్లు సోమవారం న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. దీంతో జయలలిత మళ్లీ తమిళనాడు సీఎం అయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈనెల 16 లేద 17న జయలలిత మళ్లీ తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.ఈ కేసులో తీర్పుతో తమిళనాట సంబరాలు మిన్నంటాయి. పార్లమెంటులో ఎఐడిఎంకె ఎంపిలు సంబరాలు చేసుకోగా, తమిళనాడు సిఎం పన్నీరు సెల్వం అమ్మకోసం రాజీనామాకు సిద్దపడ్డారు. జయలలితపై ఉన్నటువంటి అన్ని కేసులను రద్దు చేస్తూ కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి సోమవారం తీర్పు ఇచ్చారు. జయలలితకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ ట్రయల్‌ కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, వంద కోట్ల జరీమానా విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ప్రజాప్రాతినిధ్య చట్టం కింద తన శాసనసభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. దీనిపై జయ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కూడా కేసును మూవ్‌ చేశారు. తన కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తన రాజకీయ భవిషత్తు కూడా దీనిపై ఆధారపడి ఉందని ఆమె సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కర్నాటక హైకోర్టు జయ కేసును విచారణ జరిపి, వాదనలు విన్న అనంతరం ఆమెపై ఉన్న అన్ని కేసులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో జయలలిత మరోసారి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు తీర్పు వెలవడగానే తమిళనాటురాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సిఎం పన్నీరు సెల్వం ఆయన మంత్రివర్గ సహచరులు జయ నివాసం పోయెస్‌ గార్డెన్‌కు చేరుకున్నారు. వీరితో పాటు ఎఐడిఎంకె నేతలు కూడా ఆమె నివాసానికి చేరుకుని తాజా రాజకీయాలపై చర్చించారు. ఇదిలావుంటే ఈ కేసులో  జయతో పాటు  మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్‌, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు, ఆమె అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. బాణాసంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. అక్రమాస్తుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడటంతో జయకు రాజకీయంగా కూడా పెద్ద ఊరట లభించింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ 27వ తేదీన జైల్లోకి వెళ్లడంతో పాటే.. తన శాసన సభ్యత్వాన్ని కూడా కోల్పోయి, ముఖ్యమంత్రి పదవికి దూరమైన జయలలిత.. ఇప్పుడు మరోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఆమె అనుంగు అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం జయలలిత కోసం ఏ క్షణంలోనైనా తన పదవిని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు. రూ.66 కోట్లకు పైగా అక్రమాస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా పేర్కొంటూ కర్ణాటక న్యాయస్థానం తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. అనూహ్యమైన ఈ పరిణామంతో జయలలిత ముఖ్యమంత్రి పదవి

కోల్పోయి జైలుకెళ్లి అనంతరం బెయిల్‌పై విడుదలై ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. జయలలిత ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఆ రాష్ట్ర హైకోర్టు సుదీర్ఘంగా విచారణ నిర్వహించి తుదితీర్పు వెల్లడించడానికి రంగం సిద్ధం చేసింది.

కర్నాటక హైకోర్టు వద్ద భారీ బందోబస్తు

కర్ణాటక హైకోర్టు తుదితీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు కిలోవిూటర్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జయలలిత తరపు న్యాయవాదులు ఉదయమే క్రితమే న్యాయస్థానానికి చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిఆర్‌ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్‌ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఇప్పుడు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. దాంతో అసలు ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చినట్లయింది. ఫలితంగా.. ఆమె మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

తమిళనాట ప్రత్యేక పూజలు

సోమవారం తీర్పు వెలువడనుండడంతో అమ్మ కోసం ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే పూజలు ఆరంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, ¬మాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరిగాయి. ఎట్టకేలకు ‘అమ్మ’ మళ్లీ ముఖ్యమంత్రి కానుండటంతో.. తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు. పార్లమెంటు హాల్లో కూడా అన్నా డీఎంకే ఎంపీలు స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో తమిళనాడు అంతటా అన్నాడీఎంకే శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. జయలలిత నివాసం, అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసును ఎక్కువ కాలం నాన్చకూడదని, త్వరగా తేల్చాలని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడంతో తీర్పు ప్రతికూలంగానే వస్తుందని అందరూ అనుకున్నారు. చివరకు తమిళనాడు మంత్రులు కూడా తీర్పు ఎటు తిరిగి ఎటు వస్తుందోనన్న భయంతో భారీగా ఆలయాల్లో పూజలు, పునస్కారాలు, ఊరేగింపులు జరిపారు. కానీ అనుకోకుండా జయలలిత విడుదల కావడంతో పెద్దెత్తున సంబరాలు జరుగుతున్నాయి.

హైకోర్టు తీర్పుపై డీఎంకే సమాలోచనలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా తేలుస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డీఎంకే నేతలు సమాలోచనలు చేస్తున్నారు. కర్ణాటక ఉన్నత న్యాయస్థానం జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే యోచనలో డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టులో చుక్కెదురవుతుందని, దాంతో ఈసారి తాను ముఖ్యమంత్రి కావచ్చని ఆశించిన డీఎంకే కోశాధికారి, కరుణానిధి కొడుకు స్టాలిన్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆరేడు నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఆ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించడం ఖాయమని, అప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టవచ్చని కరుణ కుమారుడు స్టాలిన్‌ భావించారు. కానీ ఇప్పుడు ఆ కేసు నుంచి పూర్తి నిర్దోషిగా ఆమె బయటపడటంతో.. ఎలాంటి మచ్చ లేదు కాబట్టి.. ఎన్నికల ఫలితాల విూద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది.  హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే నేతలు భేటీ అయ్యారు. డీఎంకే అధినేత కరుణానిధి నివాసంలో సమావేశం కొనసాగుతోంది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసే విషయమై చర్చిస్తున్నట్టు సమాచారం.