అఖిలపక్షం ..

హైదరాబాద్‌/ఆర్మూర్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :

తెలంగాణపై ఈనెల కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌, నిజామబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలది ఆత్మగౌరవ సమస్య అని, దీనితో పోలిస్తే ప్రపంచ తెలుగు మహాసభలు ఏమంత ఎక్కువ కావని అన్నారు. తెలుగు మహాసభలను సాకుగా చూపి ఆల్‌ పార్టీ మీటింగ్‌ వాయిదా వేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోనియాగాంధీ జన్మదినాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీకి వెళ్లిన సీఎం కిరణ్‌ అఖిల పక్షాన్ని అడ్డుకోవాలనే యోచనలో పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రజా సమస్యల పేరుతో పాదయాత్రలు

చేస్తున్న చంద్రబాబు, షర్మిలకు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న 800 కుటుంబాలు వీరికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా అమరవీరులకు ఆత్మశాంతి కలిగేలా వారు           మాట్లాడలేదన్నారు. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాదయాత్ర పేరుతో దండయాత్రలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తెలంగాణపై వైఖరి చెప్పాలని ప్రశిస్తే దాడులకు తెగపడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డిసెంబర్‌ 9న తెలంగాణ సాధన దినోత్సవంగా ప్రజలంతా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రాదేమోనని ఎవరూ కలత చెందవద్దని, పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామని పిలుపునిచ్చారు.