అఖిలపక్షంలో కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి చెప్పాలి
పాలక పక్షంగా కాంగ్రెస్‌పైనే ఎక్కువ బాధ్యత ఉంది
బొత్సకు డిమాండ్ల పత్రం సమర్పించిన కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 21 (జనంసాక్షి) :
పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. ప్రత్యేక తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయం చెప్పేందుకు ఈనెల 28న కేంద్రం నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని ఐకాస నేతలు కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయం వెల్లడించాలని ఈ సందర్భంగా బొత్సను కోరారు. తెలంగాణలోని నాలుగుకోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ దాటవేత ధోరణి అవలంభిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు అన్నారు. గతంలో తెలంగాణ కోసం సకలజనుల సమ్మె చేసిన ఉద్యోగులు మరోమారు తెలంగాణ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 9 ప్రకటనతో తెలంగాణ ప్రజలు పులకించిపోయారని కానీ ఆ వెంటనే 23 ప్రకటనతో నీరుగారిపోయారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణకు కేంద్రం అనుకూలంగా ప్రకటన చేయాలని వారు పేర్కొన్నారు. దీనిపై త్వరలో ఒక ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి తెలంగాణ వచ్చేదాకా పోరాటం ఆపబోమని వారు అన్నారు. తెలంగాణ అంశంపై డిమాండ్ల పత్రాన్ని అందజేశారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత అని చెప్పారు. దేశంలో అంకితభావంతో జరుగుతున్న ఉద్యమం తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. మరే రాష్ట్రంలోనూ ఈ తరహా పోరాటం జరగడం లేదని చెప్పారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరు ప్రఖ్యాతులు సాధించిందని పేర్కొన్నారు. దీనికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు.