అఖిలపక్షం పెట్టమని నీవు కూడా కోరావు కదా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న అఖిలపక్షం ఏర్పాటు చేయన్నుట్లు ప్రకటించడం తమ పార్టీపై ఒత్తిడి పెంచడమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం నవ్వు తెప్పిస్తోంది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా చక్రం తిప్పిన చంద్రబాబు అధికారాన్ని కోల్పోయాక చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ విషయంలో ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడుతూ గందరగోళ పరుస్తున్నారు. ప్రతిసారి ఆయన ఇలాగే వ్యవహరిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండు కల్లని, ఏ కంటిని పొడుచుకుంటామని పెట్టుబడీదారి సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో వ్యాఖ్యానించారు. అసలు ఆ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ కూడా ఆయనే అనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఇటీవల ఆయనతో విభేదించి పార్టీని వీడుతున్న వారు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ముందే ఎక్కడికి చేరుకోవాలో నిర్ణయించుకుని, తాయిళాలు పుచ్చుకున్న వారి మాటలకు విలువలేదని టీ టీడీపీ నేతలు ఎంతగా చెప్పుకున్నా బాబును ఈ ప్రాంత ప్రజలు అంతగా నమ్మడం లేదు. అసెంబ్లీ నిండు సభలో తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన చంద్రబాబు డిసెంబర్ 9న అర్ధరాత్రి కేంద్రం ప్రకటన చేయగానే మాట మార్చారు. ఇంత కీలకమైన అంశంపై అర్ధరాత్రి నిర్ణయం ప్రకటిస్తారా? అంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. తమిళనాడుకు చెందిన చిదంబరం, కర్ణాటకకు చెందిన వీరప్పమోయిలీ ఆంధ్రప్రదేశ్‌పై ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ కొత్త పల్లవి ఆలపించారు. మొదట తన సామాజిక వర్గానికే చెందిన అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని హుటాహుటిన హైదరాబాద్‌కు రప్పించి పోటీ ఉద్యమానికి తెరతీశారు. దీనిని నిరసిస్తూ కొందరు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. వారిని బుజ్జగించిన బాబు తెలుగుదేశం పార్టీ జెండా కిందే తెలంగాణ ఉద్యమం చేసుకోవాలని చెప్పారు. ఏ పార్టీ టీడీపీని విమర్శించినా చూస్తూ ఊరుకోవద్దని, ఎవరైనా రెట్టించి అడిగితే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి పార్టీ లేఖ ఇచ్చిన విషయం చెప్పి ముందుకు సాగాలని మార్గదర్శనం చేశారు. అంతకుముందు వరకు టీడీపీతో లబ్ధిపొందిన వారు ఇప్పుడు ఎలా అడ్డం తిరుగుతారని నిలదీశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తే మీరు అలాగే వ్యవహరించాలి తప్ప టీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించవద్దని హితవు పలికారు. దీంతో టీ టీడీపీ నేతలు అధినేతకు రక్షణ కవచంగా మారి టీడీపీపై ఆరోపణలు వస్తే రెచ్చిపోయి ఖండనలు ఇచ్చారు. ఒక దళలో నాగం జనార్దన్‌రెడ్డి చేస్తూ పోయిన వ్యాఖ్యలు వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన నాగం జనార్దన్‌రెడ్డిపై కొందరు దాడికి తెగబడ్డారు. దీనిపై అన్ని పక్షాల నుంచి విరమర్శలు ఎదురయ్యాయి. విద్యార్థులు కూడా వెంటనే విచారం వ్యక్తం చేశారు. ఆ చర్య నాగంలో విపరీతమైన మార్పు తెచ్చింది. అప్పటి వరకు అధినేతపై ఈగ కూడా వాలనివ్వని ఆయన తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. చంద్రబాబు ఎంతకూ స్పందించకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డితో కలిసి పార్టీ వీడారు. వారివురూ ఎమ్మెల్యే పదవులు అంటిపెట్టుకుని ఉన్నా నాగం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అదే పదవిని అంటిపెట్టుకున్నావనే ఆరోపణలు ఎదుర్కోవద్దని రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయం సాధించి స్వతంత్రంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అప్పట్లో నాగం పోషించిన పాత్రను ప్రస్తుతం టీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు నిర్వహిస్తున్నారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని జేఏసీ చైర్మన్ కోదండరామ్ కోరినా ఎదురుదాడికి దిగడమే విధానమన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణలో వస్తున్న మీకోసం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలోనూ ఇదే విషయాన్ని చెబుతున్నాడు. కానీ ఎక్కడా తెలంగాణకు అనుకూలమని మాత్రం చెప్పడు. ఇప్పుడు కేంద్రం తమను ఇరికించాలనే అఖిలపక్షానికి తెరతీసిందని చెప్పి మరో వివాదం సృష్టించే ప్రయత్నమూ చేశాడు. కానీ రాష్ట్రంలోనే సీనియర్ నేత సమస్య పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదు. ఏ కన్నును పొడుచుకోవాలంటూ గతంలో ప్రశ్నించిన బాబు తెలంగాణ కన్నును బల్లెంతో పొడిచి గుడ్డిదానిగా మార్చిన విషయం మర్చిపోయారా? ఆల్రెడీ పొడుచుకున్న కన్నుకు ఇంకా చూపెందుకు అన్న భావనలోనే ఆయన ఉన్నారా? ఇదే నిజమనే భావనలోనే ప్రజలున్నారు. ఇది తెలుసుకోవాల్సింది తెలంగాణ ప్రాంత ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రమే. వారు ఇకనైనా కల్లు తెరుస్తారో.. గుడ్డిగానే బాబును సమర్థిస్తారో వాళ్లే తేల్చుకోవాలి.