27 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోయాడు

` సిడ్నీ దాడి ఉగ్రదాడి నిందితుడి వ్యవహారంపై డిజీపీ ప్రకటన
హైదరాబాద్‌(జనంసాక్షి):ఆస్టేల్రియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్‌ అక్రమ్‌ (50) వద్ద భారత పాస్‌పోర్ట్‌ ఉన్నట్లు ఆస్టేల్రియా అధికారులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌ నుంచి పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ కార్యాలయం దీనిపై ప్రకటన విడుదల చేసింది. సాజిద్‌ అక్రమ్‌ హైదరాబాద్‌ వ్యక్తి అని వెల్లడిరచింది. ఇక్కడే బీకామ్‌ చదివిన సాజిద్‌ 27 ఏళ్ల క్రితం 1998లో విద్యార్థి వీసాపై ఆస్టేల్రియా వెళ్లాడు. యూరోపియన్‌ యువతి వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు నవీద్‌ అక్రమ్‌, కుమార్తె. వీరిద్దరూ ఆస్టేల్రియా పౌరులే. సాజిద్‌ అక్రమ్‌ ఇప్పటికీ భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నాడు. అయితే, హైదరాబాద్‌లో అతడికి అతి తక్కువ సంబంధాలు ఉన్నాయని, ఆస్టేల్రియాకు వలస వెళ్లాక సాజిద్‌ ఆరుసార్లు భారత్‌కు వచ్చాడని తెలిపింది. కుటుంబ, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల కోసమే ఇక్కడకు వచ్చాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఉగ్రవాదులతో సాజిద్‌కు సంబంధాలపై తమకేవిూ తెలియదని హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులు తెలిపారని తెలంగాణ డీజీపీ కార్యాలయం తమ ప్రకటనలో వెల్లడిరచింది. సిడ్నీలోని బోండీ బీచ్‌లోఆదివారం యూదులు ’హనుక్కా ఉత్సవం చేసుకుంటుండగా ఈ ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. సాజిద్‌ అక్రమ్‌, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్‌ అక్రమ్‌.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాజిద్‌ హతమవ్వగా.. నవీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐసిస్‌)తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.ఆస్టేల్రియాలోని సిడ్నీ బాండి బీచ్‌లో డిసెంబర్‌ 14న జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. యూదుల హనుక్కా వేడుకలను లక్ష్యంగా చేసుకుని తండ్రీకొడుకులు సాజిద్‌ అక్రమ్‌ (50), నవీద్‌ అక్రమ్‌ (24) కాల్పులు జరిపారు. దాడికి ముందు నవంబర్‌లో తండ్రీకొడుకులు ఫిలిప్పీన్స్‌కు వెళ్లి వచ్చారు. అక్కడ ఐఎస్‌ఐఎస్‌`సంబంధిత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి. వారి వాహనంలో ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోసివ్‌ డివైస్‌లు, హోమ్‌మేడ్‌ ఐఎస్‌ఐఎస్‌ జెండాలు లభ్యమయ్యాయి. దాడి ఐఎస్‌ఐఎస్‌ భావజాలం ప్రేరేపితమని ఆస్టేల్రియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ప్రకటించారు. ఈ ఘటనపై భారత నిఘా సంస్థలు సాజిద్‌ కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నాయి. విషయం తెలిసిన హైదరాబాద్‌లోని అతడి బంధువులు షాక్‌కు గురయ్యారు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, తండ్రి చనిపోయిన సమయంలో భారతదేశానికి సాజిద్‌ రాలేదని పోలీసులు చెప్తున్నారు.సాజిద్‌ అక్రమ్‌ ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలియదని పోలీసులు అంటున్నారు. సాజిద్‌ అక్రమ్‌, అతని కుమారుడు నవీద్‌ ఉగ్రవాదం వైపు వెళ్ళడానికి స్థానిక ప్రభావం లేదని గుర్తించారు. 1998 సమయంలో సాజిద్‌ అక్రమ్‌ పై భారతదేశంలో ఎటువంటి కేసులు లేవని పోలీసులు అంటున్నారు.