‘వెట్టింగ్‌’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు

` వీసాదారులపై మరో బాంబు పేల్చిన అమెరికా ప్రభుత్వం
` భారీగా హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాల రద్దు
` మొదలైన వెట్టింగ్‌ ప్రక్రియ
న్యూయార్క్‌(జనంసాక్షి):హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులపై ‘వెట్టింగ్‌’ను ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భారీఎత్తున హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలను ‘ప్రుడెన్షియల్‌ రద్దు’ చేసింది. ఈ మేరకు వర్కింగ్‌ వీసాలు రద్దయినట్లు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్‌ నుంచి ఈమెయిల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. హెచ్‌-1బీ హెచ్‌4 వీసా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఈ ప్రుడెన్షియల్‌ రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్‌ అటార్నీ ఎమిలీ నాయ్‌మెన్‌ వెల్లడిరచారు. ‘‘ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. కానీ, తదుపరి వీసా అపాయింట్‌మెంట్‌ సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది’’ అని ఎమిలీ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.
ఏంటీ ప్రుడెన్షియల్‌ రద్దు..
వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ వివేకవంతంగా వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్‌ వీసా రివోకేషన్‌గా పిలుస్తారు. అయితే, ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ.. వీసాదారులు తమ గడువు పూర్తయ్యేవరకు అమెరికాలో నివాసం కొనసాగించొచ్చు. అయితే, ఒకసారి అగ్రరాజ్యం నుంచి బయటకు వెళ్తే.. వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్‌ చెల్లుబాటు కాదు.
మొదలైన వెట్టింగ్‌..
ఇదిలాఉండగా.. హెచ్‌1బీ, హెచ్‌4 వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్‌ ఉనికిని సమీక్షించే వెట్టింగ్‌ ప్రక్రియ నేటినుంచి ప్రారంభమైంది. హెచ్‌1బీ, హెచ్‌4, ఎఫ్‌, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసినవారంతా వెట్టింగ్‌కు వీలుగా తమ సోషల్‌మీడియా సెట్టింగ్‌లను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్ల ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది హెచ్‌1బీ వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి.