మహత్మా గాంధీని అవమానపరుస్తారా?
` ఎంజీనరేగా రద్దుపై పార్లమెంటులో దూమారం
` సభ ముందుకు ‘ వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్’చట్టం
` బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్
` భగ్గుమన్న విపక్ష సభ్యులు… పోడియం వద్ద నిరసన
` మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించడమే
` పాత చట్టం రద్దుతో పేదలకు పెద్ద దెబ్బ
` ఉద్యోగాలు ఇవ్వకుండా..ఉపాధి కూడా ఎత్తేస్తారా?: రాహుల్
పార్లమెంట్ వరకు నిరసనలు తెలుపుతామని వెల్లడి
` ప్రభుత్వ తీరును ఏకి పారేసిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక
` గాంధీ పేరు మార్చడంపై మండిపడ్డ శశిథరూర్
` ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్ష సభ్యుల వాకౌట్
` 17 కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన
న్యూఢల్లీి(జనంసాక్షి):మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం చట్టం ఎంజీ నరేగా రద్దుపై పార్లమెంటులో తీవ్ర గందరగోళం చెలరేగింది. నరేగా రద్దును నిరసితిస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఇది గాంధీని అవమానించడమేనని అన్నారు. నరేగా స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ’వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా హావిూ మిషన్ (గ్రావిూణ్) (వీబీ`జీ రామ్ జీ) బిల్లు` 2025’ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇది ఎంజీ నరేగా చట్టాన్ని బలహీనపర్చడమేనని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా కేంద్రం మారుస్తూనే ఉంది. పథకాల పేర్లను మార్చడం అంటే మోదీ ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టమో అర్థం కావట్లేదని అన్నారు. ఎంజీ నరేగా చట్టం పేద ప్రజలకు 100 రోజుల ఉపాధి హావిూ కల్పిస్తోంది. ఈ కొత్త బిల్లుతో ప్రస్తుత చట్టాన్ని బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లులో ఒకటో, రెండో కొత్త విషయాలు చేర్చారు. పని దినాలను పెంచారు. అంతేగానీ.. వేతనాన్ని పెంచారా అని ప్రియాంక ప్రశ్నించారు. గతంలో గ్రామ పంచాయతీలు ఈ పథకం కింద పని చేయించేవి. ఇప్పుడు కొత్త బిల్లుతో పంచాయతీలకు ఆ హక్కును దూరం చేస్తున్నారు. ఇక, ఈ బిల్లుతో ఉపాధి హావిూ పథకంపై కేంద్రం నియంత్రణను పెంచి, నిధులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ఇష్టానుసారం గానో బిల్లులను ఆమోదించుకుంటామంటే కుదరదు. ఈ బిల్లును తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక అన్నారు. ప్రియాంక మాట్లాడుతుండగా.. ట్రెజరీ బెంచ్‌లో కొందరు ’ఫ్యామిలీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ.. మహాత్మా గాంధీ మా కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు కానీ, మా కుటుంబసభ్యుడితో సమానం. గాంధీజీని యావత్ దేశం అలాగే భావిస్తోందని కౌంటర్ ఇచ్చారు. అనంతరం టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ రాముడి పేరుతో కేంద్రం దోపిడీకి పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తిప్పికొట్టారు. మహాత్మాగాంధీ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన సిద్దాంతాలను తమ ప్రభుత్వం పాటిస్తోందని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాల కంటే మోదీ సర్కారు ఎంతో కృషి చేసిందని తెలిపారు. పేదల సంక్షేమం, ఉపాధి పెంపు కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ బిల్లుపై లోక్‌సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. అనంతరం గాంధీజీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడం అనైతికమని అన్నారు. అంతేగాక, రాముడి పేరును అపవిత్రం చేయొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.సోమవారం కూడా థరూర్ ఈ పేరు మార్పుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఎంజీనరేగా పేరు మార్చి.. కేంద్రం కొత్తగా జీ రామ్ జీ బిల్లు తీసుకురావడంపై జరుగుతున్న వివాదం దురదృష్టకరం. గ్రామ స్వరాజ్ సిద్దాంతాలు, రామరాజ్య ఆదర్శాలు ఎన్నటికీ ఒకదానితో ఒకటి పోటీపడేవి కాదు. గాంధీజీ దృక్పథానికి అవి రెండు మూల స్తంభాల్లాంటివి. ఇప్పుడు పథకానికి పేరు మార్చడం అంటే ఆయన ఆదర్శాలను విస్మరించినట్లే. ఆయన వారసత్వాన్ని అగౌరపర్చే ప్రయత్నం చేయొద్దని థరూర్ అన్నారు.శశిథరూర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ తో విభేదిస్తూ మోదీ ప్రభుత్వంపై బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిల్లు విషయంలో కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
17 కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన
మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టం పేరు మార్పునకు వ్యతిరేకంగా డిసెంబర్ 17న దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు హక్కుల ఆధారిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, దానిని కేంద్రం నుండి నియంత్రించే దాతృత్వ సంస్థతో భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. గాంధీజీ వారసత్వంపైన, కార్మికులు, వారి హక్కులైనా బిజెపి కుట్రపూరితంగా దాడి చేస్తోంది. మహాత్మాగాంధీ పేరును, ఆయన విలువలను తుడిచేయడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 17న జిల్లా ప్రధాన కార్యాలయాల్లో గాంధీజీ చిత్రపటాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేసింది.
మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానం: ఎంజీ నరేగా రద్దుపై రాహుల్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీవిమర్శించారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన మోదీ ప్రభుత్వం..ఇప్పుడు గ్రామీణ ప్రజలకు కూడా ఉపాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ర్యాలీగా పార్లమెంటు వరకు వెళ్లి తమ నిరసనను తెలియజేస్తాయన్నారు. ‘‘మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులపై ప్రధాని మోదీకి ముందు నుంచి తీవ్రమైన అయిష్టత ఉంది. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే గాంధీ ఆలోచనకు ఎంజీ నరేగా ఓ సజీవ స్వరూపం. ఎన్నో ఏళ్లుగా ఇది లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు జీవనాడిగా ఉంది. కొవిడ్ సమయంలో కూడా ఈ పథకం పేదలకు ఆర్థిక భద్రతను ఇచ్చింది. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఎంజీ నరేగా ప్రధాని మోదీని ఎప్పుడూ కలవరపెడుతూనే ఉంది. కాబట్టి దీనిని బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దీనిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు’’ అని రాహుల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
గాంధీ పేరును తొలగించేందుకు కేంద్రం కుట్ర
` ఎంజీ నరేగా పేరు మార్చడం దారుణం
` దీనిపై దేశవ్యాప్త ఆందోళనలకు దిగుతాం
` కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢల్లీి(జనంసాక్షి):మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టం చారిత్రాత్మకమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఇలాంటి పథకానికి పేరు మార్చి వికసిత భారత్ ` జీ రామ్ జీగా ప్రస్తుతం నామకరణం చేశారని మంగళవారం న్యూఢల్లీిలో ఆయన విమర్శించారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఆర్‌ఎస్‌ఎస్ ` బీజేపీ ఆలోచనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని బలపర్చకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ నిప్పులు చెరిగారు. కేంద్ర ` రాష్ట్ర నిధుల వాటా 40:60గా మార్చడంతో రాష్టాల్రపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టాల్ల్రో నిధులు లేకపోతే పథకం అమలు కష్టమయ్యే పరిస్థితి ఉందన్నారు. 125 రోజులు అంటూనే ఉపాధి హావిూని అస్పష్టంగా మార్చారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకానికి దేవుడి పేరు పెట్టి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. మహాత్మా గాంధీ పేరును చరిత్ర నుంచి తొలగించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. పథకం పేరుతోపాటు అమలులో తీసుకు వచ్చిన మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ దిగుతుందని ఎంపీ చామల స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2005లో ఉపాధి హావిూ పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు. గ్రావిూణ పేద ప్రజలకు 100 రోజుల గ్యారెంటీ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అప్పటి కేంద్రం 100శాతం నిధులు కేటాయించిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో పోలీస్, ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు సైతం స్పష్టం చేసిందని తెలిపారు. రాహుల్, సోనియా గాంధీలపై కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఈడీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు. బలమైన ప్రాంతీయ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీపై ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.


