అగస్టాపై ఆగని లొల్లి

4

– పెద్దలసభలో రభస

న్యూఢిల్లీ,మే4(జనంసాక్షి): అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం వ్యవహారం రాజ్యసభలో దుమారం రేపుతోంది. ఈ అంశంపై బుధవారం కూడా విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగాయి. ఈ వ్యవహారంలో  రాజకీయ కక్ష్యతో కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేయడం లేదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి రాజ్యసభలో అన్నారు.  అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కొనుగోలు వ్యవహారాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిందని, యూపీఏ ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. చాపర్ల కొనుగోలు కోసం యూపీఏ ప్రభుత్వం అనేక ప్రమాణాలను మార్చిందన్నారు. హెలికాప్టర్ల ఎత్తును పెంచారన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ నిర్ణయం తీసుకున్నందుకు మంత్రులను, అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలని స్వామి కోరారు. ఏడబ్ల్యూ101 చాపర్‌కు ఫీల్డ్‌ ట్రయల్స్‌ చేయలేదని ఆయన ఆరోపించారు. వాస్తవానికి తొలుత 8 చాపర్ల కోసం ఒప్పందం చేసుకున్నారు, అయితే అగస్టాతో డీల్‌ కుదిరిన తర్వాత ఆ సంఖ్యను 12కు చేర్చారన్నారు. అగస్టా మధ్యవర్తి క్రిస్టియన్‌ మిచెల్‌ తండ్రితో అనేకమంది కాంగ్రెస్‌ నేతలకు సంబంధాలు ఉన్నాయని స్వామి ఆరోపించారు.

చాపర్ల కొనుగోలు కోసం వైమానిక శాఖ రూ.793 కోట్లను కేటాయించింది. కానీ దానికి విరుద్ధంగా 1200 కోట్లను అదనంగా కేటాయించారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. కొత్త డీల్‌కు అప్పటి రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. అయితే అగస్టా సంస్థతో ఎయిర్‌ఫోర్స్‌ డీల్‌ కుదుర్చుకున్న తర్వాత ఆ చాపర్ల కొనుగోలు కోసం ఆరు రేట్లు అంటే రూ.4877.5 కోట్లు చెల్లించేందుకు కమిటీ నిర్ణయించిందని స్వామి ఆరోపించారు. తొలుత 8 చాపర్లను కొనుగోలు చేయాలని రక్షణశాఖ భావించింది, కానీ అగస్టాతో ఒప్పందం కుదిరిన తర్వాత దాన్ని 12కు పెంచారని ఆయన విమర్శించారు. తాను వెల్లడించే వాస్తవాలను కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతుందన్నారు. అగస్టా కేసు విచారణకు సహకరించని వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని స్వామి అన్నారు. స్వామి ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌ శర్మ సభలో డాక్యుమెంట్లను ప్రవేశపెట్టాలన్నారు. దాంతో సభలో రభస మొదలైంది. వీవీఐపీలు ప్రయాణించేందుకు ఎన్టీయే ప్రభుత్వ హయాంలో అత్యాధునిక హెలికాప్టర్ల కొనుగోలుకు నిర్ణయం జరిగినట్లు భాజపా ఎంపీ భూపేందర్‌ యాదవ్‌ తొలుత  మాట్లాడుతూ తెలిపారు. ప్రపంచంలోని ఉత్తమ హెలికాప్టర్ల తయారీదారుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు తప్ప… ఒక కంపెనీ నుంచి మాత్రమే తీసుకోవాలని నిర్ణయించలేదన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.  రక్షణ వ్యవస్థతో సంబంధం ఉన్న అంశాలు కీలకమైందన్నారు. ఎం8 హెలికాప్టర్లను మార్చామన్నారు. 1962, 71 యుద్ధాలు గురించి గర్వంగా మాట్లాడుకునేవాళ్లం అన్నారు.

డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ను బహిరంగ పరచడం పట్ల కేంద్ర రక్షణ మంత్రి పారికర్‌కు ఎంపీ భూపేంద్ర కంగ్రాట్స్‌ తెలిపారు. అగస్టా చాలా తీవ్రమైన సమస్య అని, ప్రస్తుత చర్చల ద్వారా భవిష్యత్తు విధానాలను రూపొందించుకోవచ్చన్నారు. అగస్టా వ్యవహారంలో కుదిరిన ఒప్పందాల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆపరేషనల్‌, సర్వీస్‌ అవసరాలను 2015లో మార్చారని ఆరోపించారు.అగస్టాను కొనుగోలు చేసేందుకు హెలికాప్టర్ల ఎత్తును పెంచుతూ మార్చిన నిర్ణయం పట్ల కాగ్‌ సీరియస్‌ అయ్యిందన్నారు. ఒక్క కంపెనీకి ఫేవర్‌ చేసేందుకు అగస్టా కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు. అగస్టా కొనుగోలు కోసం ఎస్టిమేషన్‌ను ఆరు రేట్లు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. 8 హెలికాప్టర్ల స్థానంలో 12 హెలికాప్టర్లకు ఆర్డర్‌ ఇచ్చారన్నారు. హెలికాప్టర్ల ధరను కూడా కాంగ్రెస్‌ పార్టీ పెంచి చూపించిందన్నారు. పోటీ లేకుండా ఒకే కంపెనీ నుంచి హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వాస్తవ పరిస్థితులను పక్కనబెట్టి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు నిబంధనలు సైతం మార్చివేసినట్లు పేర్కొన్నారు. 8 హెలికాప్టర్లు అవసరమనుకుంటే 12 కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. భారత్‌లో వినియోగించుకునేందుకు కొనే హెలికాప్టర్లకు విదేశాల్లో ఎందుకు పరీక్షలు నిర్వహించారో అప్పటి ప్రభుత్వం సమాధానం చెప్పాలని భూపేందర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. అగస్టా వ్యవహారంలో బీజేపీ ఎంపీ భూపేంద్ర చేసిన ఆరోపణలకు కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌మను సింఘ్వి సమాధానం ఇచ్చారు. అగస్టా డీల్‌ సజావుగా సాగుతుందనుకోవడం లేదన్నారు. అగస్టా ఒప్పందాన్ని సంచలనం చేస్తున్నారు తప్ప, దాన్ని అర్థం చేసుకోవడంలేదన్నారు. అగస్టా డీల్‌ను రద్దు చేసిం కాంగ్రెస్‌ పార్టీనే అని సింఘ్వి తెలిపారు. అగస్టా ఒప్పందం వ్యవహారంలో ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సభలో ప్రస్తావించారు. కోర్టు తీర్పులో సోనియా గాంధీ గురించి పేర్కొన్న అంశాన్ని కూడా ఆయన చదవి వినిపించారు. సోనియాకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యలు లేవని తీర్పులో ఉన్నట్లు ఆయన తెలిపారు. సోనియా గాంధీ ఒక ఎంఐ8 హెలికాప్టర్లు వాడదన్న విషయాన్ని మాత్రమే తీర్పులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. అధికార పక్షం అగస్టా డీల్‌ను టీ కప్పులో తుఫానులా చూస్తోందన్నారు. మన కోర్టులు, విచారణాధికారులను నమ్మకుండా, కేవలం ఇటలీ కోర్టు తీర్పునే ప్రభుత్వం నమ్ముతోందన్నారు. అధికార పక్షం అభద్రతాభావంలో ఉందని, అందుకే నిర్ధోషులపైన అబాంఢాలు వేస్తోందన్నారు. అగస్టా వ్యవహారంలో చాలా పరిపక్వంగా, సమతుల్యంగా వ్యవహరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  గస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంపై నిషేధం విధించే పక్రియ 2014 ఫిబ్రవరిలో ప్రారంభమైందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వీ తెలిపారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ ఒప్పందంపై జులైలో తాత్కాలిక నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఇదిలా వుంటే దేశంలో సంచనం సృష్టిస్తున్న అగస్టా కుంభకోణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ హస్తముందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని తాను పార్లమెంట్‌లో డిమాండ్‌ చేస్తానని రమేష్‌ చెప్పారు. అగస్టా స్కాం పై  ఎంపీ రమేష్‌ చేసిన తాజా ఆరోపణ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఇప్పటికే ఈ కుంభకోణంపై పార్లమెంటులో చర్చించేందుకు అధికారపార్టీ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరుగా చర్చలు జరుపుతున్నారు.  అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంలో హష్కీతో బ్రదర్‌ అనిల్‌కు సంబంధాలున్నాయని  సీఎం రమేష్‌ ఆరోపించారు. బుధవారం కడపలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. 2012లోనే దీనిపై రాజ్యసభలో ప్రస్తావించినా.. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. బ్రదర్‌ అనిల్‌పై ఖమ్మం జిల్లాలో కేసు నమోదైందని తెలిపారు. సీబీఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటపడతాయన్నారు. ఇప్పటికే దీనిపై పార్లమెంటులో రగడ సాగుతోంది. మాజీ ఎయిర్‌చీఫ్‌ త్యాగిని మూడ్రోజులుగా విచారిస్తున్నారు. తాజాగా ఇప్పుడు బ్రదర్‌ అనిల్‌ పత్రాపపై విచారణ జరపాలి టిడిపి కోరుతోంది.