అజ్ఞాతం వీడిన రాహుల్‌

2

న్యూఢిల్లీ,ఏప్రిల్‌16(జనంసాక్షి): గత రెండు నెలలుగా అజ్ఞాత జీవితం గడిపిన  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు రాజధాని న్యూఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్‌ బ్జడెట్‌ సమావేశాలకు ముందురోజు ఫిబ్రవరి 22న రాహుల్‌ గాంధీ సెలవుపై వెళ్లారు. రాహుల్‌ ఎక్కడికి వెళ్లారన్నదానిపై పలు ఊహాగానాలు జోరందుకున్నాయి. విపక్షాలు కూడా రాహుల్‌ పర్యటనపై విమర్శలు చేశాయి. అయినా కాంగ్రెస్‌ అధినేత్రి కానీ, ఆపార్టీ నాయకులు కానీ రాహుల్‌ పర్యటనపై స్పందించలేదు. రెండు నెలల తర్వాత గురువారం ఉదయం రాహుల్‌ దిల్లీ చేరుకున్నారు. రాహుల్‌ తన పర్యటన వివరాలు వెల్లడించొద్దని భద్రతా సిబ్బందికి సూచించినట్లు సమాచారం. తీవ్ర విమర్శల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ యువనేత రాహుల్‌ గాంధీ గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన అధికారిక నివాసానికి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే చేరుకున్నారు. అయితే రాహుల్‌ గతరాత్రి 11 గంటలకే భారత్‌ చేరుకున్న విశ్వసనీయవర్గాల సమాచారం.

ఇదిగో వస్తాడు… అదిగో వచ్చేస్తున్నాడని రెండు నెలలుగా ఊరిస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు ఢిల్లీకి వచ్చాడు. బుధవారం సాయంత్రం తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అత్యంత కీలకమైన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఉన్నట్టుండి తాను సెలవు తీసుకుంటానని చెప్పి, ఎక్కడికో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన రాహుల్‌ గాంధీ.. ఏకంగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ హస్తినాపురిలో అడుగుపెట్టాడు. రాహుల్‌ గాంధీని చూసేందుకు ఆయన తల్లి సోనియా గాంధీ గురువారం ఉదయం రాహుల్‌ ఇంటికి వెళ్లారు.

అంతకుముందు తమ వైఫల్యాల గురించి ప్రశ్నించడం తర్వాత.. ముందు రాహుల్‌ గాంధీ ఎక్కడున్నాడో వెతుక్కోవాలంటూ బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీని ఎద్దేవా కూడా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అమేథీ వెళ్లినప్పుడు కూడా అక్కడి ప్రజలు రాహుల్‌ గాంధీ ఎప్పుడొస్తారని అడిగారు. ఈనెల 19వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ ఇతర ప్రతిపక్షాలతో కలిపి భారీ ఎత్తున రైతు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని తలపెట్టింది. దానికి ముందుగానే రాహుల్‌ను  రప్పించాలన్న ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి.

ఆగ్నేయాసియాలోని వియాత్నం నుంచి రాహుల్‌ భారత్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి రాహుల్‌ గాంధీ అజ్ఞాతంలో ఉన్నారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు సైతం రాహుల్‌ సెలవు పెట్టారు. మొత్తం 55 రోజులపాటు దేశానికి దూరంగా ఉన్నారు. ఉరుగ్వేలో కొంతకాలం ఉన్నట్లుగా సమాచారం. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల నుంచి వరుసగా ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దారుణంగా ఓడిపోవడంతో రాహుల్‌ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని అందుకే విశ్రాంతి కోసం దూరంగా ఉన్నారని ఇంతకాలం చెబుతూ వచ్చారు.

పార్టీ ప్రక్షాళన గురించి, పార్టీలో తాను నిర్వహించవలసిన పాత్ర గురించి అంతర్మధనం చేసుకునేందుకే రాహుల్‌ గాంధీ సెలవు తీసుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతూ వచ్చాయి. సెలవు సమయంలో రాహుల్‌ గాంధీ స్పెషల్‌ ప్రొటక్షన్‌ గ్రూప్‌ భద్రతను కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పర్యటన ఎక్కడ జరిగిందీ బయటి ప్రపంచానికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతగా గోప్యత పాటించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.