అట్టహాసంగా పద్మ పురస్కారాలు

5

న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల విూదుగా ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 8మందికి పద్మభూషణ్‌, 43 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. ధీరూభాయి హీరాచంద్‌ అంబానీ, అవినాష్‌ కమలాకర్‌ దీక్షిత్‌, జగ్‌మోహన్‌, యామినీ కృష్ణమూర్తి, శ్రీశ్రీరవిశంకర్‌లు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అంబానీ తరఫున ఆయన భార్య కోకిలా బెన్‌ పురస్కారన్ని అందుకున్నారు. పండిట్‌ రవిశంకర్‌ ప్రత్యేక ఆకర్శణగా కనిపించారు. అయితే రామోజీరావు, సానియా విూర్జాలు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నవారిలో  షాపూర్‌జీ పల్లోంజీ, సైనా నెహ్వాల్‌, వినోద్‌రాయ్‌, ఆళ్ల వెంకటరామారావు, దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, భాజపా సీనియర్‌నేత అడ్వాణీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది 112 మంది ప్రముఖులకు ప్రకటించిన పద్మ అవార్డుల్లో 56 మందికి పురస్కారాలు ప్రదానం చేశారు. మిగిలిన 56 మందికి వచ్చే నెలలో అవార్డులు ప్రదానం చేస్తారని అధికారులు చెప్పారు. ఏప్రిల్‌లో పురస్కారాలు అందుకోనున్నవారిలో రామోజీ రావు, నటులు రజినీకాంత్‌, ప్రియాంకా చోప్రా, టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జాలున్నారు.