అది నీతైతే.. ఇదీ నీతే!

2

– నాడు ఎన్టీఆర్‌ను గద్దెదించడం నేటి విలీనం

– ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌,మార్చి12(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌లోకి టిడిఎల్పీ విలీనంపై ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందించారు. టీడీఎల్పీ విలీనానికి ప్రజా ఆమోదం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఎర్రబెల్లి మాట్లాడారు. పార్టీ శాసనసభ పక్షాన్నే టీఆర్‌ఎస్‌లో విలీనం చేశామని, ఫిరాయింపు కాదని ఆయన పేర్కొన్నారు. గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గద్దె దించిన బాబు చర్యలకన్నా ఇది పెద్దదేవిూ కాదని ఆయన అన్నారు.  అంతేకాకుండా తాను టిఆర్‌ఎస్‌లోకి వస్తానని ఎవరికీ ఫోన్‌ కూడా చేయలేదని చెప్పారు.  తన చర్య సమర్ధనీయమని తెలుగుదేశం పార్టీని విలీనం చేసిన సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పార్టీ మారలేదని, విలీనం చేశామని, ఇది గుర్తుంచుకోవాలన్నారు. కెసిఆర్‌ తర్వాత వరుసగా గెలుస్తున్న వ్యక్తిని  కూడా తానే అని కూడా ఆయన  పేర్కొన్నారు. కాగా విలీనంపై స్పీకర్ను అడుగాలని చెప్పారు.  ఈ విధంగా   చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి. తాను ఎన్టీఆర్‌ వీరాభిమానినని ఆయన చెప్పుకుంటూనే ఇలా తన చర్యను సమర్థించుకోవడం విశేషం. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలంతా తన వెంటే ఉన్నారని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  గతంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తనతో ఉన్న 50 శాతం మంది కార్యకర్తలు ఒప్పుకోలేదని, కాని ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని వివరించారు.