అది రైతులను నిండా ముంచే బిల్లు

4
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్నా పాదయాత్ర

న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి):  సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోమారు ఉద్యమంలోకి దిగనఉన్నారు. ఇటీవలే జంతర్‌మంతర్‌ వద్ద ఆందోలన చేసిన అన్నా భూ సేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని అనుచరులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులకు తెలిపారు. రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఉన్న భూసేకరణ బిల్లును, ప్రభుత్వ విధానాల్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మార్చి 25న మహారాష్ట్రలోని సేవా గ్రామ్‌లో ప్రారంభమయ్యే ఆయన పాదయాత్ర 1100 కిలోవిూటర్ల నడక తరువాత దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ముగుస్తుంది. ఇది పూర్తికావడానికి రెండున్నర నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ బిల్లు రైతులను నట్టేట ముంచేదిగా ఉందన్నారు. ఎలాంటి సవరణలు తాము కోరుకోవడం లేదని, మొత్తంగా బిల్లును ఉపసంహరించుకోవాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. కేవలం కార్పోరేట్‌ కంపెనీలకు మేలుచేసేదిగా బిల్లు ఉందన్నారు. దీంతో రైతులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేస్తామని చెప్పిన  ప్రభుత్వం ఇప్పుడు వారికి మేలు కాదుకదా కీడుకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు.