అది సుంకం కాదు.. మీపై హత్యాయత్నం

4

– బంగారు వ్యాపారుల ఆందోళనలో రాహుల్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 6(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బంగారం వ్యాపారులకు  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ మద్దతు పలికారు. కేంద్రం విధించిన ఎక్సైజ్‌ సుంకం రద్దు చేయాలన్నారు. ఇది వారి వ్యారానికి గుదిబండ కానుందన్నారు.  కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాహుల్‌  మరోసారి మండిపడ్డారు. బంగారు ఆభరణాలపై కేంద్రం విధించింది ఎక్సైజ్‌ సుంకం కాదని.. అది వర్తకులపై హత్యాయత్నమని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న బంగారం వర్తకులతో బుధవారం రాహుల్‌ సమావేశమయ్యారు. కొందరు వ్యాపార వేత్తలు మేక్‌ ఇన్‌ ఇండియాకు మద్దతిస్తూ.. చిన్న వ్యాపారులను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌ సింగ్‌, హర్యాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ హుడా, రోహ్‌తక్‌ ఎంపీ దీపేందర్‌ హుడా, కాంగ్రెస్‌ పార్టీ దిల్లీ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ ఉన్నారు. బంగారు ఆభరణాలపై ఎక్సైజ్‌ సుంకం విధించడమే గాక, రూ. 2లక్షల కొనుగోళ్లకు పాన్‌ కార్డ్‌ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ.. గత నెల రోజులకు పైగా బంగారం వర్తకులు ఆందోళన చేపట్టారు. దీనికి కాంగ్రెస్‌ మద్దతు పలికింది.