అద్దె ఇంట్లో ఇద్దరుయువకుల దారుణ హత్య
నిజామాబాద్ టౌన్‌లో హత్యల కలకలం
రంగంలోకి దిగిన పోలీసులు
ఆధారాల కోసం జాగిలంతో గాలింపు
నిజామాబాద్,మే3(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ కాలనీలో జంట హత్యలు
కలకలం సృష్టించాయి. అద్దె ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువకుల మృతదేహాలు రక్తపుమడుగులో పడి ఉన్నాయి. గత నాలుగు నెలల క్రితం ముగ్గురు యువకులు కలిసి ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఈ ముగ్గురు కలిసి టీ స్టాల్ నడుపుకుంటున్నారు. గత రెండు రోజుల నుంచి గదికి తాళం వేసి ఉండడం, ఆ గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి తలుపులు విరగొట్టాడు. ఇంట్లో రక్తపుమడుగులో పడి ఉన్న ఇద్దరు యువకులను చూసి యజమాని షాకయ్యాడు. అనంతరం నిజామాబాద్ మూడో టౌన్ పోలీసులకు ఇంటి యజమాని సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల ను కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాకు చెందిన సాయి, శ్రీ కాంతులుగా పోలీసులు గుర్తించారు. అయితే మరో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రితం యువకులు హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఎవరు హత్య చేసి ఉంటారా అన్న అనుమానాలతో దర్యాప్తు మొదుల పెట్టారు. పోలీస్ జాగిలాలతో తనిఖఙలు చేపట్టారు. ఎవరికైనా సమాచారం ఉంటే తమకు అందించాలని పోలీసులు కోరారు.