అధికారానికి ముందే కుమ్ములాటలు
అధికారంపై ఆశల పల్లకిలో విహరిస్తున్న భారతీయ జనతా పార్టీలో ఎన్నికలకు ముందే కుమ్ములాటలు మొదలయ్యాయి. 2014 సాధారణ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి అప్పగించాలన్న కొందరు పార్టీ నేతల నిర్ణయంపై అగ్రనేత ఎల్‌కే అద్వానీ అలకబూనారు. పనాజీలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ పదాధికారుల సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం కారణంగానే సమావేశాలకు హాజరుకాకపోతున్నట్లు అద్వానీ ముందస్తు సమాచారమిచ్చారని ఆ పార్టీ అధినేత రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించినా దానిపై ఎన్నో సందేహాలు సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. అద్వానీ అలక వీడకపోగా మరో అగ్రనేత, హోంశాఖ మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా తన వ్యాఖ్యలతో కలకలం సృష్టించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా పదాధికారుల సమావేశానికి హాజరుకాకపోవడానికి వేరే కారణాలున్నాయని తెలిపాడు. మొదటి రోజు సమావేశానికి డుమ్మాకొట్టిన అద్వానీ స్వపక్షంలోని కొందరు ముఖ్య నేతల ఒత్తిడి మేరకు రెండో రోజూ పనాజీకి వచ్చి పదాధికారుల సమావేశంలో పాల్గొంటారనే ప్రచారం సాగినా అది నిజం కాదని తేలిపోయింది. అగ్రనేత బెట్టువీడలేదు. స్వతహాగానే దుందుడుకు స్వభావమున్న నేతగా పేరున్న నరేంద్రమోడీకి ఈ పరిణామం మింగుడు పడకుండా చేసింది. మోడీని ప్రమోట్ చేయడానికే బీజేపీ పనాజీలో ఏర్పాటు చేసిన సమావేశం లక్ష్యం తీరకపోగా కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. స్వపక్షంలోని నేతలనే ఒప్పించుకోలేని వారు ఇక ప్రజలకు ఏం సేవ చేస్తారని కాంగ్రెస్ బీజేపీపై మాటలయుద్ధానికి తెరతీసింది. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడంలో సొంత పార్టీ వారినే ఒప్పించుకోలేకపోతున్న కమలనాథులు ఇక ప్రజలను ఏం ఒప్పిస్తారని ప్రశ్నల షరాలను కాంగ్రెస్ సంధించింది. అద్వానీ గైర్హాజరు బీజేపీ అంతర్గత అంశం. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అంశం కాంగ్రెస్ సహా ఇతర ఏ పార్టీలకూ లేదు. కానీ ఇక్కడ మనం గుర్తించి తీరాల్సిన అంశాలూ ఉన్నాయి. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్ చేయడంపై ఎన్‌డీఏలో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ తర్వాత ఎన్‌డీఏలో రెండో అతిపెద్ద పార్టీ జేడీ(యూ) ప్రధానిగా నరేంద్రమోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మోడీపై పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీనిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమైంది. నితీశ్ అభిప్రాయంతో ఏకీభవించేవారూ బీజేపీలోనూ ఉన్నట్టు అప్పుడే సందేహాలు వ్యక్తమైనా పనాజీ సమావేశంతో అది బహిర్గతమైంది. నరేంద్రమోడీ బీజేపీలో అతివాద భావజాలమున్న నేతల్లో మొదటి వరసలో ఉంటారు. గుజరాత్‌లో ఆయన సీఎం అయ్యాక ముస్లింలపై సాగించిన మారణహోమం తాలూకూ విషాద ఘటనలు బీజేపీని వెంటాడుతూనే ఉన్నాయి. గుజరాత్‌లో బీజేపీ మూడు పర్యాయాలు అధికారంలోకి రావడానికి మోడీనే కారణమని పార్టీ అగ్రనాయకత్వంలోని కొందరు బావిస్తున్నారు. అయితే 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయమేమీ సాధించలేదు. చావుతప్పి కన్నులొట్టపోయినట్టు బొటాబొటీ మెజార్టీతో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. మోడీ సమ్మోహన శక్తి, అత్యంత జనాధరణ ఉన్న నేతే అయితే గుజరాత్‌లో ఆధరణ తగ్గడానికి కారణమేమిటీ అనే ప్రశ్న సొంతపార్టీ నేతలే లేవనెత్తారు. అప్పుడు బీజేపీ అగ్రనేతలెవరూ సామాధానం చెప్పలేదు. దానికి కారణం ఆయనకున్న హిందుత్వ ఆధరణతో 2014 ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనేదే బీజేపీ అభిమతం. కానీ బీజేపీలోని ఒకవర్గం నేతలు మోడీ వల్ల వచ్చే అనుకూల పరిణామాలనే కాదు ప్రతికూల పరిణామాలనూ బేరీజు వేసుకుని ఆయన్ను ముందు పెట్టవద్దని పేర్కొంటున్నారు. దేశంలో 15 శాతం మంది మైనార్టీలు ఉన్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ వర్గం ప్రజలు మొత్తం బీజేపీకి, ఎన్‌డీఏకు దూరమయ్యే అవకాశముందని అద్వానీ సహా ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న సన్నాహక సమావేశంలోనే సమన్వయం సాధించని బీజేపీ, సొంతపార్టీలోని కలహాలను పరిష్కరించుకోలేని పార్టీ దేశాన్ని ఏం చక్కబెడుతుందనే అనుమానం ఇప్పుడు దేశ ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.