అధికారికంగా ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవం జరపండి

3

ఆదివాసీల డిమాండ్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): తెలంగాణ స్వరాష్ట్రంలో మొదటిసారి జరిగే ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో 34 ఏళ్ల క్రితం పోలీసు కాల్పుల్లో మృతిచెందిన గిరిజన అమరవీరుల దినోత్సవాన్ని ఈ నెల 20న అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదవరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సమైక్యరాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం నివాళులర్పించేందుకు నిషేదాజ్ఞలు విధించి అడ్డుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెరాస నాయకులు, ప్రస్తుత పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ 2013లో పర్యటించినప్పుడు స్వరాష్ట్రంలో అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఇచ్చిన హావిూని గుర్తు చేశారు.  అందుకోసం గిరిజనులంతా సంఘటితమై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకొని అనుమతివ్వాలని ఆయన కోరారు. ఆదివాసులు తమ హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన ఇంద్రవెల్లి సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరుతామన్న ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ రోజు వరకూ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే మాట ఎత్తడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ఆ రోజు అమరులైన కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5లక్షలు చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయనతో పాటు ఆదివాసీ గిరిజనసంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.