అధికార పార్టీలకు ఆకర్షణ ఎక్కువ

రాజకీయాల్లో నీతి, సిద్దాంతాలకు కాలం చెల్లింది. రాజ్యాంగానికి అసలు విలువే లేదు. ఇది ఒక్క తెలంగాణ లేదా ఆంధ్రకే కాదు దేశానికి అంతటికీ ఇదే వర్తిస్తుంది. ఏ పార్టీ నుంచి గెలిచినా ఇతర పార్టీలోఎకి వెళ్లడం వల్ల వచ్చే ఇబ్బంది ఏవిూ లేదని గతానుభవాలు చెబుతున్నాయి. తాజగా ఇరు తెలుగు రాష్టాల్ల్రో జరిగిన సంఘటనలు మరోమారు మనముందు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని వీడిన 12 మంది తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ అనుబంధ సభ్యులుగా గుర్తిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మదుసూధనాచారి నిర్ణయం తీసుకున్నారు. తమను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు రాసిన లేఖను సభాపతి మధుసూదనాచారి ఆమోదించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో టిడిపిలో ఇంకా రేవంత్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్యలు మాత్రమే మిగిలారు.  తెలంగాణ టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనం కావడంతో ఈ మేరకు అసెంబ్లీలో వారికి శుక్రవారంనాడు వేరువేరుగా సీట్లను కేటాయించారు. ఇక ఎపిలో కూడా ఇంచుమించుగా ఇలాంటి ఫిరాయింపులే జరిగాయి. ఇంకా జరగుతాయి. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున టిడపిలో చేరుతున్నారు. భూమా నాగిరెడ్డి తదితరులు పార్టీలో చేరిపోయారు. ఈ తరుణంలో తెలంగాణ టిడిపి నేతలు గానీ, కాం/-గరెస్నేతలుగానీ రాజ్యాంగం, విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వీరంతా గతంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి తప్పులకు కారకులే. అందుకే ఇప్పుడు ఇలాంటివి మాట్లాడడం కన్నా ఎవరు ఎక్కడికి పోతారో పోనీ అని చూడాలి. ప్రజలు వారిని ఆదరిస్తారా లేదా అన్నది భవిష్యత్‌పై ఆధారపడి ఉంది. కొత్తగా ఏర్పడ్డ ఇరు రాష్టాల్ల్రోనూ ఇప్పుడు ఆపరేషన్‌ ఆకర్శక్‌ కొనసాగుతోంది. ఇదంతా ఎదుటి పార్టీలను మట్టి కరిపించేందుకు తప్ప మరోటి కాదు.  అధికారంలో ఉన్న పార్టీలోకి చేరడం ద్వారా తామూ అధికార పక్షంలో ఉండేందుకు కొందరు ఇష్టపడతారు. తమ నియోజకవర్గాల్లో ఏదైనా పనులు చేయాలంటే అధికార పక్షంలో ఉంటేఉ తప్ప వీలు కాదు. ప్రస్తుత  రాజకీయాల్లో విపక్షంలో ఎక్కువకాలం ఎక్కవమంది మనలేరు. కొందరు మాత్రమే చలించకుండా విపక్షంలో ఉండగలరు. ఇలా అందరికీ సాధ్యం కాదు. దీనికితోడు స్థానికంగా అభివృద్ది జరిగితేనే ప్రజలు ఆదరిస్తారు. ఇది జరగాలంటే అధికారపార్టీలో ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు ఇరు రాష్టాల్ల్రో అధికారంలో ఉన్నే టిడిపి,టిఆర్‌ఎస్‌ వైపు వెళ్లేందుకు ఇతర పార్టీల్లో ఉన్న నేతలు కండువాలు మారుస్తున్నారు. ఇది రాజకీయాల్లో ఉన్న జాడ్యంగానే గుర్తించి ఊరుకోవాలి. దీనిని రాజధ్రోహం అనో, రాజ్యాంగ ఉల్లంఘనగానో రంకెలు వేస్తే గతంలో చేసిన తాలూకు పాపాలు కళ్లముందు కదలాడుతాయి. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని కాంగ్రెస్‌,టిడిపి  నాయకులు విమర్శలు మొదలెట్టారు. అయితే ఈ వికృత రాజకీయ క్రీడకు తెర తీసింది మాత్రం దివంగత రాజశేఖర్‌ రెడ్డి అని చెప్పడంలో సందేహం  లేదు. ఆనాడు వైఎస్‌ తీరును తప్పు పట్టని వారికి ఇవాళ జరుగుతున్న తీరును విమర్శించే అర్హత లేదు.  ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఎదురుండకూడదన్న ఉద్దేశంతో అటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు తెలుగుదేశం నాయకులకు వల విసిరారు. ఈ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు రెండు పార్టీలకు చెందిన పలువురు లొంగిపోయారు. ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి మొదలుపెట్టిన ఆటను ఇప్పుడు ఉభయ రాష్టాల్ర ముఖ్యమంత్రులైన కేసీఆర్‌, చంద్రబాబు కొనసాగించే పనిలో ఉన్నారు. ఇంకా పక్కాగా కొనసాగిస్తున్నారు.  దీనిని తప్పుపడుతున్న టిడిపి, కాంగ్రెస్‌,వైకాపాలు గతాన్ని తలచుకోవాలి. నాడు ఆకర్షక్‌ తప్పు కానప్పుడు నేడు కూడా అది తప్పు కాకూడదు. ఒకసారి న్యాయం అయినప్పుడు మరోమారు అన్యాయం ఎలా అవుతుందో  ఈ పార్టీల నేతలు గమనించాలి. అందుకే జగన్‌ లేదా జానారెడ్డి లేదా రేవంత్‌ రెడ్డిలు ఎంతగా తక్కువ మాట్లాడితే అంతమంచిది. దీనికి తోడు ఆయా ఎమ్మెల్యేలు తమకు నచ్చిన పార్టీలో కొనసాగాలని అనుకుంటున్నారు.  తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్‌- తెలుగుదేశం పార్టీలలో ఉన్న వారు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో కెసిఆర్‌ అభివృద్ది మంత్రం బాగా పనిచేస్తోంది. వెనకబడిన తమప్రాంతాలను అభివృద్ది చేసుకోవాలని అందిరికీ ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపే ఆలస్యం   రెండు పార్టీలలో ఉన్న నేతలు ఏకకాలంలో టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ అవుతున్నారు. దీనికితోడు తెలంగాణలో బలమైన ప్రతిపక్షం గానీ, కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనగల నాయకుడు గానీ లేరు. ఆంధ్రాలో సైతం ఈ తరహా వ్యవహారమే సాగుతోంది. అక్కడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో ఆయా పార్టీల నేతలు తమకోసం కాకున్నా తమ ప్రాంతం కోసం అన్న సూక్తిని ఆచరిస్తున్నారు. దీనికి జగన్‌ లేదా ఆయన అనుచరులు గగ్గోలు పెట్టాల్సిన పనిలేదు.  తెలంగాణ కాంగ్రెస్‌ లో అందరినీ కలుపుకొనివెళ్లగల నాయకత్వం ఆ పార్టీకి లేకుండా పోయింది. అదే సమయంలో అటు కేంద్రంలో కూడా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. భవిష్యత్తుపై పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వగలిగే స్థితిలో ఎవ్వరూ లేరు.  అందుకే  తొందరగా పార్టీ మారడం కోసం ఇష్టపడుతున్నారు. నిజంగా ఇది అన్యాయమైతే పార్టీ ఫిరాయింపుల చచట్టాన్ని గట్టిగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. కాని ఇందుకు ఆ పార్టీ సిద్దంగా లేదు. అందువల్ల ఫిరాయింపులు అన్న పదనాకి అర్థం మారింది.  ఇష్టమైన వారు ఇష్టమైన చోట ఉంటారు. అందుకే అభివృద్ది మంత్రం అన్నది అందరూ జపిస్తున్నారు.