అధికార సమాచారం ప్రయివేటు మెయిళ్లకు నిషిద్ధం

2

దిల్లీ, మార్చి1(జనంసాక్షి): అధికారిక సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ సిబ్బంది ప్రైవేటు ఈమెయిల్‌ సేవలను వినియోగించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమాచార సాంకేతిక పరిజ్ఞానం వనరుల వినియోగంపై ఒక విధానాన్ని గత వారం వెల్లడించింది. దీని ప్రకారం… అధికారిక సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ నెట్‌వర్క్‌లో ప్రైవేటు ఈమెయిల్‌ సర్వర్లను వినియోగించకూడదు. ప్రభుత్వ అధికృత ఈమెయిల్‌ సర్వర్లనే ఉపయోగించాలి. ప్రభుత్వేతర ఈమెయిల్‌ సేవలకు ఏదైనా సమాచారాన్ని పంపడాన్ని(ఫార్వర్డ్‌ ఆప్షన్‌) సైతం ఈ విధానం నిరోధిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించి… అధికారులకు రెండు ఈమెయిల్‌ ఐడీలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ ¬దాపై కాగా, మరొకటి వారి పేరు మీద. వ్యక్తిగత సమాచార మార్పిడి కోసం సైతం అధికారులు తమ పేరుతో ఉన్న ఈమెయిల్‌ ఐడీని ప్రభుత్వ అధికృత సేవల ద్వారా వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్రం అందిస్తున్న ఈమెయిల్‌ సేవలను వినియోగించుకునే రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ విధానం వర్తిస్తుంది. కొన్ని సాఫ్ట్‌వేర్‌, అంతర్జాల కంపెనీల సాయంతో భారత్‌ సహా పలు దేశాల అధికారిక సమాచారాన్ని అమెరికా నిఘా సంస్థలు రహస్యంగా సేకరిస్తున్నాయని ప్రజావేగు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఆరోపించిన నేపథ్యంలో ఐటీ, ఎలక్ట్రానిక్‌ విభాగాలు ఈ విధానాన్ని ప్రతిపాదించాయి.