అన్నదాతలు ఆత్మహత్యలు వద్దు
– మన కళ సాకారం కాబోతోంది
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,మార్చి8(జనంసాక్షి): తెలంగాణలో రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులపై ఐదు బ్యారేజీలు నిర్మించేందుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు బృందానికి బేగంపేట విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం లభించింది.
అనంతరం ర్యాలీగా బయల్దేరిన సీఎం…. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినవన్నారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని, రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ కావాలని, కృష్ణ, గోదావరి నీళ్లు తెలంగాణలోని పంటపొలాలకు మళ్లాలని అన్నారు.దీనివల్ల రాష్ట్రాన్ని సాధించినప్పటి సంతోషం మళ్లీ కలుగుతోందని అన్నారు.ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలతో పాటు వరంగల్, నల్గొండజిల్లాలోని భూములకు సాగునీరు నూతన ప్రాజెక్టుల ద్వారా అందుతుందని సీఎం చెప్పారు. రెండున్నరేళ్లలోనే బ్రహ్మాండంగా సాగునీరు ఈ ప్రాంత భూములను తడపనుందని, రెండు పంటుల పండించుకోవచ్చని వివరించారు. తెలంగాణ రైతులు రెండు పంటలు పండించుకునేందుకు ఈ ఒప్పందం వీలు కలిగిస్తుందని చెప్పారు మహారాష్ట్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపి, సమన్వయం చేసిన మంత్రి హరీశ్‌రావును ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులతో తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. తమకు అద్భుత విజయాన్ని అందించిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు త్వరలో 24 గంటలూ తాగునీరు అందిస్తామని చెప్పారు. 15 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మలిచే వరకు కేసీఆర్ నిద్రపోరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.