అన్నింటా ఓట్ల రాజకీయాలేనా?
రాజకీయ పార్టీల పరమావధి ఓట్లు.. సీట్లు.. రాజ్యాధికారం. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ రాజకీయాలకు కొన్ని హద్దులు ఉండాలి. ఏదిపడితే అది, ఎక్కడ పడితే అక్కడ చేరి రాజకీయం చేయడం విజ్ఞత అనిపించుకోదు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించి, గత తొమ్మిదేళ్లుగా విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విప్తకర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియంది కాదు. ఉత్తరాఖండ్‌లో సంభవించింది సాదాసీదా విపత్తు కాదు. పెను ఉప్పెన లాంటి ఘోరకలి. అలాంటి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. వారిని రక్షించేందుకు సైన్యం చేస్తున్న ప్రయత్నాలను అభినందించాలి. సైన్యం చేసిన సాహసం వల్ల ఎన్నోవేల మంది బతికి బయటపడ్డారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి అమెరికా వెళ్లిన బాబుకు ఇప్పుడు ఇక్కడికి చేరాక ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారు గుర్తుకు వచ్చారు. గతవారం రోజులుగా ఉత్తరాఖండ్ సైన్యం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. తెలుగువారిని విమానాల్లో తరలించలేదన్నది చంద్రబాబు ఆరోపణ. తెలుగువారంటే లక్ష్యం లేదని విమర్శలు. కొట్టుకుపోయింది భారత ప్రజలన్న ఇంగితం లేకుండా చంద్రబాబు మాట్లాడడం సరికాదు. ఏపీ భవన్‌కు వెళ్లి అక్కడి అధికారులపై రుబాబు ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం. ఇది సమయమేనా? అన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. వరద బాధితులను ఆదుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఏమయ్యారు. ఇన్నాళ్లూ ఎక్కడ పోయారన్న ఆలోచన చేశారా? కనీసం సహాయక చర్యలను గమనించి ఏమి చేయాలో సూచన చేయాల్సిన పెద్ద మనిషి విమర్శలకు దిగడం సహాయక చర్యలను తప్పు పట్టడం దారుణం. ఇక్కడ కూడా రాజకీయం చేసి లాభం పొందాలనుకోవడం శవరాజకీయాలు తప్ప మరోటి కాదు. పెనువిపత్తు నుంచి ప్రాణాలతో బయటపడి ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్న ఉత్తరాఖండ్ వరద బాధితులకు చంద్రబాబు ఓదార్పు అందిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎపి భవన్ నుంచి నాలుగైదు రోజులుగా బాధితులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే సరైన వసతులు కల్పించటం లేందంటూ చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు, మీ ప్రభుత్వానికి మానవత్వమే లేదంటూ మండిపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన వారిని ఆదరించే తీరు ఇదేనా అంటూ నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనతకు వ్యతిరేకంగా ఏపీ భవన్ ముందు సుమారు రెండు గంటల పాటు ధర్నా చేసి తీవ్రనిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఓ మాజీ సీఎం చేయాల్సిన పనేనా ఇది అన్నది ఆలోచించాలి. ప్రభుత్వానికి మానవత్వం ఉందా? ఆకలి దప్పులతో అల్లాడుతూ ఇంత దూరం వచ్చినవారికి సాంబరు అన్నంతో సరిపెడతారా? మీ కుంటుంబికులకే ఈ పరిస్థితి ఎదురైతే.. ఇలాగే చేస్తారా?’ అంటూ అక్కడి అధికారులను నిలదీశారు. ‘మహిళలు స్నానాలు చేసేందుకూ వసతులు కల్పించకపోతే ఎలా? ఇది ఆంధప్రదేశ్ ప్రజల భవనం. కాంగ్రెస్ భవన్ కాదు. సోనియా గాంధీ చెబితేనే వీరికి వసతులు కల్పిస్తారా?’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. అధికారుల నుంచి స్పందన లేదన్న ఆగ్రహంతో చంద్రబాబు ఏపీ భవన్ ప్రాంగణంలో బైఠాయించి సుమారు రెండు గంటల సేపు ధర్నా చేశారు. ఆయనతో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, కె.నారాయణ, గుండు సుధారాణ కూడా నేలపై కూర్చొన్నారు. నిజంగానే బాధితులకు అమర్యాద జరిగి ఉంటే నిలదీయాల్సిందే. ఇందుకు పద్ధతిని ఎంచుకోవాలి. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. కానీ రాజకీయం కోసమే బాబు అలా చేశారని ఎవరిని అడిగినా చెప్పేలా వ్యవహరించారు. ఎంపీలు చంద్రబాబు వచ్చే వరకు ఏం చేస్తున్నట్లు? వారు కమిషనర్‌ను కలసి ఈ మాత్రం వసతులు కల్పించ లేకపోయారా? లేకపోతే వారికి నిలబడి పరిచర్యలు చేసి ఉంటే ఎంత బాగుండేది. వారికి స్నానాలకు గదులు ఇవ్వకుండా, తిండిపెట్టకుండా, తరలించడానికి టిక్కెట్లకు డబ్బులు అడిగి ఉంటే అలాంటి అధికారులను ఉరితీయాల్సిందే. ఆపదలో సర్వం కోల్పోయి వచ్చిన వారికి ఆసరాగా ఉండాల్సిందే. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఇది గమనించకుండా కేవలం పరామర్శలకు వెళ్లి ఉంటే వారిని నిలదీయాల్సిందే. నిజాం కాలంలో అసఫ్‌జాహీ నవాబులు నిర్మించిన భవన్ ఉమ్మది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఏపీ భవన్‌గా మారింది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం కాబట్టి అక్కడ తెలుగువారందరికీ చోటు ఉందనడంలో సందేహం లేదు. ఏపీ భవన్‌కు వచ్చిన బాధితులను బిచ్చగాళ్లలాగా చూసి ఉంటే లేదా అందుకు బాధ్యులైన వారిని నిలదీసి శిక్ష విధించాల్సిందే. రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదని చెప్పారు. అమెరికా నుంచి ఉదయమే వచ్చానని, వరద సహాయక చర్యలపై ఈనెల 15న సీఎం, కేంద్ర ¬ంశాఖ మంత్రికి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి లేఖలు రాశానని చంద్రబాబు తెలిపారు. అయినా ఫలితం లేదని అని చంద్రబాబు తెలిపారు. ఏపీ భవన్‌లో తెలుగువారికి న్యాయం చేయాలనే డిమాండుతో ధర్నా చేయాల్సి వస్తుందని ఏనాడూ ఊహించలేదని అన్నారు. తెలుగువారికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని, చనిపోయిన వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబు నిలవడాన్ని ఎవరూ తప్పు బట్టడం లేదు. కానీ ఈ సందర్భాన్నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలని చూడటం, రాజకీయ ఆరోపణలకు దిగడం సరికాదు. ఈ చర్యను విజ్ఞులెవరూ సమర్థించబోరు. రాజకీయాలకు ఉపయోగించుకునే సందర్భాలేమిటో దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు, కానీ ఆయన ఉత్తరాఖండ్ బాధితుల పక్షాన ఏదో చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేసిన కొన్ని చర్యలు వెకిలి చేష్టలను తలపించాయి. ఇంతటి విపత్తు సంభవించినపుడు అందరూ సంయమనంతో వ్యవహరించాలి. బాధితులను ఆదుకునేందుకు తలా ఓ చేయి వేసి ముందుకు సాగాలి. ప్రతి చోటా రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. ఎవరు ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తున్నారో గుర్తు పట్టలేనంత అమాయకులు ప్రజలనుకుంటే అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు.