.అమెరికాలో మిన్నంటిన నిరసనలు

` లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు..
` నిరసనకారుకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు
` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం
` పలువురు అక్రమ వలసదారుల అరెస్టు
వాషింగ్టన్‌(జనంసాక్షి):అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్‌ అధికారులు లాస్‌ ఏంజెలెస్‌లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిరసనకారులను తీవ్రంగా హెచ్చరించారు. ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. అందులో ‘కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. ఈ విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఫెడరల్‌ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్య వలే పరిష్క రిస్తాం’ అని అధ్యక్షుడు రాసుకొచ్చారు. లాస్‌ ఏంజెలెస్‌ ఘటనను వైట్‌హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ తీవ్రంగా ఖండిరచారు. ఇవి యూఎస్‌ చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని ఉద్ఘాటించారు. కాగా.. రెండోరోజు కూడా ఆందోళనలు కొనసాగాయి.
అక్రమ వలసదారుల అరెస్టు
లాస్‌ ఏంజెలెస్‌లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులతో సహా తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఫెడరల్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడ నిరసనలు చెలరేగాయి. వందలమంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. సర్వీస్‌ ఎంప్లాయీస్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్‌ హుయెర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్‌ భవనం వెలుపలకు చేరుకొని ఆయనను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్‌ అధికారులు పెప్పర్‌ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

 

తాజావార్తలు