అన్ని కంపెనీలు హైదరాబాద్‌వైపు పరుగు
బెంగళూరు, చెన్నై, పూణేకన్నా మన నగరమే మెరుగు
హైదరాబాద్ శరవేగ అభివృద్ధిపై సీఎన్‌బీసీ ప్రత్యేక కథనం
హైదరాబాద్,ఏప్రిల్17(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రంగాల్లో స్థంభించిపోయిన హైదరాబాద్ మహా నగరం తెలంగాణ ఏర్పడ్డాక కొత్త సర్కారు పాలనలో తిరిగి కార్పొరేట్‌లు, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని,. వారంతా హైదరాబాద్‌పై కన్నేశారని సీఎన్‌బీసీ టీవీ 18 పేర్కొంది. ఇటీవల కాలంలో ప్రదానంగా హైదరాబాద్‌లో తిరిగి రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. 2009 తర్వాత రియల్ రంగం ఇప్పుడు తిరిగి పుంజుకుంటోంది. కార్పొరేట్ సంస్థలకు బెంగళూరు, పుణె, ఢిల్లీ తదితర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో భూముల ధరలు అందుబాట్లో ఉన్నాయి. గుర్‌గాంలో ఒక స్క్వేర్ ఫుట్ స్థలం రెంట్ 80 రూపాయలుగా ఉంది. అదే హైదరాబాద్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రాలైన హైటెక్ సిటీలో అయితే 45 రూపాయలు, గచ్చిబౌలీలో అయితే 35-40 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. ఇక బిజినెస్ పరంగా మార్కెట్‌లో నిలదొక్కుకోవటానికి, కొనసాగటానికి ప్రధానంగా అవసరమైన రెసిడెన్షియల్ పర్పస్‌కైతే, హైటెక్ సిటీ లాంటి ప్రధాన ఐటీ కారిడార్‌లో పెట్టుబడి విలువ 5500 నుంచి 5700 రూపాయల వరకు ఉంది. ఇది చెన్నై ఓఎంఆర్ రోడ్‌లో కంటే తక్కువే. ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారతదేశంలోకెల్లా అత్యంత చవకైనది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించటానికి ముఖ్యంగా మేనుఫాక్చరింగ్(తయారీ), ఐటీ, ఐటీ ఆదారిత సేవల రంగాల్లో మంచి ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. చాలా వరకు పన్ను మినహాయింపులు కూడా కల్పిస్తోంది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపుతోపాటు పలు ఇతర మినహాయింపులు ఇస్తోంది. ప్రభుత్వం ఐటీ, ఐటీ ఆధారిత సేవల విభాగంలోనే కాకుండా తయారీ రంగానికి కూడా పెద్దయెత్తున రాయితీలు కల్పిస్తోంది. గత ఏడెనిమిదేళ్లగా చూస్తే… తయారీ రంగానికి సంబంధించిన ఆటోమొబైల్ సంస్థలు, పవర్ సెక్టర్ కంపెనీలు, సెల్యులర్ కంపెనీలు పుణె, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు తరలివెళ్లాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌లో తయారీ రంగంలో ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టలేదు. అయితే కొన్ని మాసాల క్రితమే ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు జాన్సన్ అండ్ జాన్సన్, పీఅండ్ జీలు హైదరాబాద్‌లో ప్లాంట్‌లను ఏర్పాటు చేశాయి. ఇక అమెజాన్ సంస్థ కూడా ఇటీవలే 3లక్షల చదరపు అడుగుల స్థలంలో యూనిట్ నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంఘతి తెలిసిందే. తెలంగాణ ప్రబుత్వం కేవలం ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను మాత్రమే కాకుండా, వస్తువులను తయారుచేసే కంపెనీలను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన పాలసీలు ఫ్రకటించింది. ఒక నగరం సమపాళ్లలో అభివృద్ధి చెందాలంటే ఐటీతోపాటు తయారీ రంగంలోనూ పెట్టుబడులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే గేత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన తయారీ రంగానికి కూడా కేసీఆర్ సర్కారు పలు రాయితీలు కల్పిస్తోంది. అందుకే పెట్టుబడిదారుల చూపు హైదరాబాద్ వైపు మళ్లింది.