అబూజ్‌మడ్.. ఓ మరో ప్రపంచం
ఆకుపచ్చ కోనలో అన్నల పాలన
– నిజాలు వెలికితీస్తున్న జర్నలిస్టులు
– వృత్తి ధర్మం కోసం పణంగా ప్రాణాలు
– ‘తెహెల్కా’ తరుణ్‌కు ‘జనంసాక్షి’ ఘన నివాళులు
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి) :
జనంమెవ్వరు నమ్మని నిజం దాగుంది అక్కడ.. లోకమెన్నడు వినని చరిత్ర ఉందక్కడ.. ఓట్లడగని ‘పాలకుల’ పాలన సాగుతుందక్కడ.. సమాచార వ్యవస్థ జాడ లేని ప్రాంతమది.. ఇలాంటి ఎన్నో అక్షర సత్యాలను అక్షరబద్ధం చేయడానికి.. వాళ్ల బతుకుల్లో వెలుగులు నింపడానికి ‘కలం’వీరులు కదంతొక్కుతున్నారు.. వృత్తి ధర్మం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. అదృష్టం కలిసి వస్తే బతికి వస్తున్నారు.. లేకుంటే, ఆ అడవుల్లో కనుమరుగవుతున్నారు.. లేదా విగతజీవులుగా ఇంటికి చేరుతున్నారు..
‘గూగుల్’.. ఇంటర్నెట్‌పై కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఈ పదం సుపరిచితమే. ‘ప్రపంచం మొత్తంలో ఏ సమాచారం కావాలన్నా చిటికెలో పుంకాలు పుంకాలుగా మన ముందుంచే సర్చ్ ఇంజన్ అన్నా..’ అంటూ ఠపీమని చెప్పేస్తారు. కానీ, ఆ గూగుల్‌కు కూడా చిక్కని ఓ ప్రాంతం.. ప్రపంచంలోని ఒకే ఒక్క ప్రాంతం మనదేశంలో ఉంది.. ప్రపంచ పటంలోనూ ఆ ప్రాంతం కనబడదు.. అదే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అబూజ్‌మడ్. అబూజ్ అంటే తెలియదు అని, మాడ్ అంటే అడవి అని ఆదివాసీ భాషలో అర్థాలు. అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్న మన భారతదేశంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోని ప్రాంతమది. పైగా అక్కడ మావోయిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న జనతన సర్కార్‌ను కూల్చేందుకు యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. గ్రీన్ హంట్ పేరుతో సమరానికి సిద్ధమవుతున్నారు. పారా మిలిటరీ బలగాలను మోహరించి అక్కడ ప్రశాంతంగా జీవితాలను కబళించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగరికతకు దూరంగా బతుకుతున్న తమను అనుమానాలతో బలితీసుకుంటున్నారని ఆదివాసులు వాపోతున్నారు. ఈ వ్యవహారంతోపాటు అక్కడి ఆదివాసుల బతుకు చిత్రాలను వెలికితీసేందుకు కృషి చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే.. అది పాత్రికేయులే. వృత్తిధర్మంలో భాగంగా, సహజంగా తమలో ఉన్న మానవత్వపు విలువల ప్రోద్బలంతో పాత్రికేయులు అష్టకష్టాలు పడి ఆ అడవుల్లో తిరుగుతూ సమాచార సేకరణ చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రపంచం ముందు పెడుతున్నారు. అలాంటి ఓ లక్ష్యంతోనే అబూజ్‌మడ్‌లో అడుగుపెట్టిన ప్రఖ్యాత సంచలన ఇంటర్నెట్ వార్తా సంస్థ ‘తెహెల్కా డాట్ కం’ ఫొటో జర్నలిస్ట్, 23 ఏళ్ల తరుణ్ సెహ్రావత్ వార్తా సేకరణ చేస్తూనే అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించక, అక్కడ తాను తిన్న ఆహారమే విషమై ‘సెలెబ్రల్ మలేరియా’ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువ జర్నలిస్ట్‌కు ‘జనంసాక్షి’ యావత్ తెలంగాణ తరుపున ఘనంగా నివాళులర్పిస్తున్నది. తరుణ్ మాత్రమే కాకుండా ఇంతకు ముందు కూడా ఓ ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం చేసింది మన ‘జనంసాక్షి’ ఎడిటర్ రహ్మానే. ఆయన ఇంతకు ముందు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ న్యూస్ చానల్లో పని చేస్తుండగా 2009లో అబూజ్‌మడ్‌లో పర్యటించారు. అక్కడి పరిస్థితులు, ప్రజల జీవన శైలిని ప్రపంచానికి చూపించారు. ఆయన సేకరించిన వార్తల సమాహారాన్ని 12 నవంబర్ 2009 నుండి 18 నవంబర్ 2009 వరకు చానల్లో ప్రసారం చేసూఏ్త పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ సాగిన ఆయన పర్యటన, కవర్ చేసిన తీరు ఎంతో మంది జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచింది. ఎడిటర్ రహ్మాన్ అబూజ్‌మడ్ నుంచి తిరిగి వచ్చాక ఆయన అనుభవాలను పొందుపరుస్తూ ‘చలో ఛత్తీస్‌గఢ్’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాశారు. ఎవరూ చూడని, అక్బర్ పాలనలో తప్ప ఆ తరువాత ఉనికిలోకి రాని అబూజ్‌మడ్‌లో కాలుమోపడం ఓ సాహసం. ఆ సాహసాన్ని ప్రదర్శిస్తూ అక్కడి ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులను అభినందిద్దాం. ప్రోత్సహిద్దాం. వారి సమాచార సేకరణ విజయవంతంగా ముగిసి, వారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. మరోసారి యువ జర్నలిస్టు తరుణ్ సెహ్రావత్‌కు ఘనంగా నివాళులర్పిద్దాం.