అభివృద్ధి పట్టాలపై ఆసియా దేశాలు

5

– రైల్వే దశ మారుస్తాం

– వేర్వేరు సభల్లో ప్రధాని మోదీ

ఢిల్లీ,మార్చి12(జనంసాక్షి):ఆసియా దేశాలు అన్నింట్లో అభివృద్ధి చెందుతున్నాయని, ప్రపంచ ఆర్థిక పునరుత్తేజంలో ఆసియా దేశాలే ఆశాకిరణాలుగా వ్యవహరిస్తున్నాయని, ఇది శుభపరిణామమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో జరుగుతున్న అడ్వాన్సింగ్‌ ఆసియా అనే సదస్సులో మోదీ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. ప్రతి దేశం అభివృద్ధికి, ప్రపంచ ఆర్థిక సంస్థలు క్రమంగా సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని  మోదీ సూచించారు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐఎంఎఫ్‌ ఇస్తున్న కోటా ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సమానంగా లేదని, వచ్చే ఏడాది ఇవ్వనున్న కోటా మొత్తాన్ని పెంచుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఇది దేశాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఐఎంఎఫ్‌ తన పాత్రను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా మోదీ తెలిపారు. అందుకోసం  అడుగులు వేయాల్సిన, ఆచరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం గ్రావిూణ, వ్యవసాయ రంగాలకు  కేటాయింపులను పెంచిందని, ఇది వ్యవసాయరంగ అభివృద్ధికి ఎంతో ఉపయోగమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు కూడా చెబుతూ, ఆర్థిక స్థిరత్వం సాధించడంలో గణనీయమైన ప్రగతి సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఆసియా దేశాల్లో భారత ఆర్థిక ప్రగతి ప్రత్యేకమైందని, అనేక పద్దతుల్లో ఆసియా ఖండ అభివృద్ధికి భారత్‌ సహకరిస్తోందని వివరించారు.   ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆసియా దేశాలే ఆశాకిరణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  21వ దశాబ్దం ఆసియాదేనని చాలా మంది విజ్ఞానవంతులు చెబుతున్నారని, ఆ మేరకు  సంస్కరణలు చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎంతో ప్రభావితం చేస్తాయని, దీంతో ప్రపంచ వ్యాప్త సంస్థల్లో సంస్కరణలు అనేవి నిరంతర పక్రియగా కొనసాగుతుందని ఆయన అన్నారు. అలాగే ఆసియాలో భారత్‌కు మొదటి నుంచి ప్రత్యేకమైన స్థానం ఉందని వివరించారు. గతం నుంచే చరిత్రాత్మకంగా భారత్‌ ఎన్నో విధాలుగా ఆసియాకు తోడ్పడిన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. భారత్‌లో వ్యవసా యంపై అనేక జీవితాలు ఆధారపడి ఉన్న సందర్భంగా ఆ రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఇది బడ్జెట్‌ , ఇతర లెక్కల్లో కనిపిస్తుందని ఆయన అన్నారు. కేవలం రైతు ఆదాయం రెట్టింపు కావాలన్నదే భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ మేరకే పనిచేస్తున్నామని వివరించారు.  అలాగే  గ్రావిూణ,  అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అందుకోసం పెట్టుబడులు పెంచామని ఆయన గుర్తు చేశారు.  ఐఎంఎఫ్‌ కోటాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపకూడదని, దీనికోసం అందరం పనిచేయాలని చెప్పారు. బహుళ సంస్కృతుల అంశంలో భారత్‌పై గొప్ప నమ్మకం ఉందని, దాన్ని నిలబెట్టుకుంటామని ప్రధాని చెప్పారు.

రైల్వేల గతినే మార్చేస్తాం

భారత్‌ లో రైల్వే గతిని మార్చేస్తామని ప్రధాని మోడీ చెప్పారు. దేశంలో రైల్వేలతో పాటు రహదారులను అనుసంధానం చేసే ప్రక్రియపై దృష్టిపెడతామన్నారు. బీహార్‌ లోని హాజీపూర్‌ లో డిగ-సోనేపూర్‌ రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. అటల్‌ బీహారీ వాజ్‌ పేయ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 15 ఏళ్ల పాటు ఈ బ్రిడ్జి నిర్మించటం విశేషం. ఈశాన్య భారత్‌ అభివృద్ధికి ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీకి బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీహార్‌ కు మోడీ రావటం ఇదే తొలిసారి. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే మోడీ, నితీష్‌ లు ఒకే వేదికను పంచుకోవటం విశేషం. హాజీపూర్‌ కు వచ్చేందుకు ఇద్దరు నేతలు ఒకే హెలిక్యాప్టర్లో ప్రయాణం చేశారు. వేదికపై ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. నితీష్‌ మాట్లాడుతున్న సమయంలో జనం మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. దీంతో మోడీ కుర్చీలో నుంచి లేచి నిశ్శబ్దంగా ఉండాలని సూచించటంతో జనం శాంతించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోడీ పాట్నా హైకోర్టు శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. భారత ప్రజాస్వామ్యానికి న్యాయస్థానాలు పట్టుకొమ్మలని చెప్పారు. టెక్నాలజీ కారణంగా న్యాయశాస్త్రంలో మరింత పారదర్శకత పెరిగిందన్నారు.