అభివృద్ధే సిసలైన మంత్రం

3

భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది

కెనడాలో ప్రధాని నరేంద్ర మోదీ

టొరంటో, ఏప్రిల్‌ 16(జనంసాక్షి):  అభివృద్దే అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.. భారత దేశంలో ప్రస్తుతం ఆశావాదం, విశ్వాసంతో కూడిన వాతావరణం నెలకొందని ఆయన చెప్పారు. భారత్‌లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత దేశంలో ఇప్పుడు యువతరం జనాభా అధికంగా ఉందని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశాన్ని నైపుణ్య భారంగా తీర్చిదిద్దుతామని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భారత్‌ కీలక పాత్ర పోషించడానికి పరమాణుశక్తి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టొరంటోలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత దేశాన్ని అన్ని విధాల సహకరిస్తున్న కెనడాకు కృతజ్ఞతలు తెలిపారు. కెనడాలోని ప్రధాననగరం టొరంటోలో మోదీ సభ అమెరికాలోని మాడిసన్‌ స్క్వేర్‌సభను తలపించింది. రికో కోలీజియంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో మోదీతోపాటు కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్‌ హార్పర్‌ దంపతులు పాల్గొన్నారు. హార్పర్‌ సతీమణి చీర కట్టుకుని రావడం అందరినీ ఆకట్టుకుంది. ఆ కార్యక్రమానికి కెనడా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కెనడియన్ల ఆదరాభిమానాలకు నరేంద్రమోదీ కృతజ్ఞతలు

చెప్పారు. కెనడియన్లు తననొక్కరినే కాక 125 కోట్ల మంది భారతీయులను గౌరవించారంటూ ఆయన ప్రసంగించారు. మోదీ ప్రసంగం ప్రారంభించగానే సభికులు పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రపంచం గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి ఆందోళన పడుతుందని, వాతావరణ మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బోలెడంత ఇంధనాన్ని ఖర్చు చేస్తూ ఏసీ గదుల్లో కూర్చొని పర్యావరణం గురించి పెద్ద పెద్ద దేశాలు చర్చలు జరుపుతాయని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భారత్‌ సఫలమైతే ప్రపంచంలో ఆరోవంతు బాధ్యత తీసుకోగలదని ఆయన అన్నారు. దానికి కావలసింది స్వచ్ఛమైన శక్తి అని, దానికి పరమాణు శక్తి చాలా అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. అందుకే మేం రియాక్టర్లు నిర్మిస్తామని, వాటి కోసమే కెనడా నుంచి యురేనియం తీసుకుంటామని ఆయన చెప్పారు ప్రపంచం ఆందోళన చెందుతున్న పర్యావరణ పరిరక్షణ అంశంలో సహకరిస్తామని మోదీ స్పష్టం చేశారు.నరేంద్రమోదీ కెనడాతో తన సంబంధాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత అమెరికా, ఇంగ్లండ్‌ వంటి దేశాలకు భిన్నంగా కెనడా తనపై ఎలాంటి ఆంక్షలు విధంచలేదని ఆయన తలచుకున్నారు. 2003 నుంచే కెనడా, గుజరాత్‌ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం భారత దేశంలో నాలుగు విప్లవాలు సృష్టించడానికి సిద్ధపడుతుందని ఆయన అన్నారు. అవి జాతీయ జెండాలోని నాలుగు రంగులను ప్రతిబింబిస్తాయని మోదీ అన్నారు. కాషాయ విప్లవం ద్వారా ఇంధన రంగాన్ని, శేత్వ విప్లవం ద్వారా పశుపోషణ రంగాన్ని, హరిత విప్లవం ద్వారా వ్యవసాయాన్ని, నీలి వప్లవం ద్వారా పర్యావరణ పరిక్షణను సాధిస్తామని మోదీ తెలిపారు. ప్రవాస భారతీయులకు సహకరించే చర్యలను వేగవంతం చేస్తున్నట్లు మోదీ వివరించారు.