అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ

3

వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ప్రధాని మోదీ ల్యాండ్‌ అయ్యారు. బ్రస్సెల్స్‌లో పర్యటన ముగించుకున్న ఆయన గురువారం  వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. గురువారం జరగనున్న అణు భద్రతా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆ సదస్సు రెండు రోజులు జరగనుంది. ఆ తర్వాత ఆయన సౌదీ అరేబియా చేరుకుటారు. అక్కడ కూడా ఆయన రెండు రోజుల పాటు పర్యటిస్తారు. సౌదీతో ఎనర్జీ ఒప్పందాలు కుదుర్చుకుంటారు.  ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిజం ఊడలు దిగి భయంకరంగా తయారైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బ్రస్సెల్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. గత వారం బ్రస్సెల్స్‌లో జరిగిన ఉగ్ర దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదం కారణంగా ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. తీవ్రవాదాన్ని ఇప్పటికీ ఐక్యరాజ్యసమితి నిర్వచించలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదులకు మద్దతునిస్తోన్న, ఆశ్రయం కల్పిస్తోన్న దేశాలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేక పోతోందని తెలిపారు. మతం నుంచి తీవ్రవాదాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తుపాకుల ద్వారానే తీవ్రవాదం అంతంకాదని, సామాజిక మార్పు ద్వారానే అది సాధ్యమని వివరించారు. యువకులు తీవ్రవాదం వైపు మళ్లకుండా చూడాల్సిన బాధ్యత సమాజానిదేనని స్పష్టం చేశారు.