అమెరికా సైన్యంలో గడ్డం,తలపాగాకు అనుమతి

2

అమెరికా సైన్యంలో ఇది ఓ మంచి మార్పు ….

వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): అమెరికా సైన్యం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సైన్యాధికారి కెప్టెన్‌ సిమ్రత్‌పాల్‌ సింగ్‌ (28)కు అరుదైన అనుమతిని ఇచ్చింది. తలపాగా, తదితర సిక్కు మత ఆచారాలను పాటిస్తూ సైన్యంలో సేవలందించేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. అమెరికా సైన్యంలో పనిచేస్తున్న సిక్కు మతస్థుడికి ఇటువంటి అనుమతి రావడం ఇదే తొలిసారి.సిమ్రత్‌పాల్‌ సింగ్‌ గత నెలలో అమెరికా రక్షణ శాఖపై దావా వేశారు. తన మతాచారాల ప్రకారం ధరిస్తున్న తలపాగా, గెడ్డం వల్ల తనను వివక్షకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హెల్మెట్‌, గ్యాస్‌ మాస్క్‌ కోసం అదనపు పరీక్షలు చేయించుకోవాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. రక్షణ శాఖపై ఇటువంటి దావా దాఖలు కావడం ఇదే మొదటిసారి.అమెరికా సైన్యం గత నెల 31న సిమ్రత్‌పాల్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆయన తన మతాచారాలను అనుసరిస్తూనే దేశానికి సేవ చేయవచ్చునని తెలిపింది. తలపాగా,గెడ్డం వల్ల యూనిట్‌ ఐక్యత, నైతికత, క్రమశిక్షణ, ఆరోగ్యం, భద్రతలకు ముప్పు కలిగినపుడు మాత్రమే ఈ ఆదేశాలను ఉపసంహరిస్తామని ప్రకటించింది.ఈ ఆదేశాలపై సిమ్రత్‌ పాల్‌ స్పందిస్తూ సైన్యంలో పని చేయాలన్నది తన కల అన్నారు. అదేవిధంగా మిగతా సైనికుల మాదిరిగానే తాను కూడా పని చేస్తున్నానని, అయితే తన మతం తనలో అంతర్భాగమని తెలిపారు. దేశ సేవ, మతం… ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం ఇకపై లేదని ఆనందం వ్యక్తం చేశారు.