అరాచకం రాజ్యమేలింది
స్వచ్ఛ హైదరాబాద్ మహా ప్రయోగం
చెత్తలేని నగరంగా మన రాజధాని : సీఎం కేసీఆర్
హైదరాబాద్,మే22(జనంసాక్షి): కొందరి పుణ్యాత్ముల వల్ల హైదరాబాద్‌లో అరాచక వ్యవస్థ రాజ్యమేలిందని, దాని ప్రభావం ఇంకా కనపడుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై సీఎం కేసీఆర్ సవిూక్ష నిర్వహించిన సందర్భంలో ఈ వ్యాఖ్య చేవారు. అరాచక వ్యవస్థను అంతమొందిచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండానే హైదరాబాద్ నగరంలో ఆకాశ హర్మ్యాలు వెలిశాయని, . ఇష్టారాజ్యంగా భూకబ్జాలు చేశారని, నాలాలపై కూడా ఇండ్లు కట్టుకున్నారని,. కొన్ని బస్తీల్లో అసలు స్థలమే లేకుండా చేస్తే, మరికొన్నిచోట్ల కనీసం ఓ మొక్క నాటడానికి కూడా లేకుండా చేశారని అన్నారు. ఇది తీవ్ర ఆవేదన కలిగించే విసయమన్నారు. హైటెక్స్‌లో స్వచ్చ హైదరాబాద్ పై జరిగిన కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ అవినీతిని అంతం చేస్తేనే ఇలాంటివి జరక్కుండా ఉంటాయన్నారు. ఒక్క సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే పార్శీగుట్టలో స్మశానం తప్ప కొంచెం కూడా ఖాళీ ప్రదేశం లేదు. 10 వేల మంది పేదలకు ఇండ్లు లేవు. పాఠశాలలు కట్టుకుందామంటే స్థలం లేదు. చెట్లు నాటుకుందామన్న స్థలం దొరకని పరిస్థితి హైదరాబాద్ బస్తీల్లో నెలకొంది. బస్తీల్లో సమస్యల పరిష్కారానికి కమిటీలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త కన్పించకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. హైజెనిక్ కూరగాయాలు, మాంసం మార్కెట్లు ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. ఇకపోతే తెలంగాణలో కరెంట్ సమస్య తీరిపోయింది. ప్రధాన సమస్యలైన నీరు, శానిటేషన్ సమస్యను త్వరలోనే అధిగమిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి 24 గంటలు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ ప్రజలకు 35 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. సెప్టెంబర్ నాటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు వస్తాయన్నారు. ఇప్పటికే కృష్ణా నుంచి 12 టీఎంసీలు, సింగూరు నుంచి 8 టీఎంసీలు, గండీపేట నుంచి 5 టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌కు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో పది లక్షల జనాభా పెరుగుతోందని తెలిపారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని తయారు చేసుకోవాలని చెప్పారు. మరో 30 ఏళ్ల ముందు చూపుతో నగరంలో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. వీటన్నిటికి ధృడసంకల్పంతో ముందుకు సాగాల్సి ఉందన్నారు.
ఇక స్వచ్ఛ హైదారబాద్ కార్యక్రమంలో గమనించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా శస్త్ర చికిత్స చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. హైదారబాద్‌లో చెత్త అన్నది కనిపించకుండా చూడాలని సిఎం కెసిఆర్ అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని నగరం అంతా అద్దంలా మెరిసిపోవాలని, ఇక ఎక్కడా చెత్త అన్నది కనిపించకుండా చేయాలని అన్నారు. ఈ లక్ష్యాన్ని రెండు నెలల్లోనే సాధించగలమని, ప్రజల్లో ఆ విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. ఎవరు కూడా చెత్త, ప్లాస్టిక్ లాంటివి రోడ్లపై వేయకుండా చూడాల్సి ఉందన్నారు. ఇంటినుంచి చెత్త రిక్షా పుల్లర్‌కు అక్కడి నుంచి లారీలకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు చేరేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే ఆక్రమణలకు గురైన నాలాలను రక్షించి వాటిని శుద్ది చేయాల్సి ఉందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయం సాధించిన సందర్భంగా ఇందులో పాల్గొన్న వివిధ శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లినప్పుడు తాను, మంత్రులు గమనించిన అంశాలను ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ లైన్ల గురించి చాలాచోట్ల ఫిర్యాదులు వచ్చాయని, పలు ప్రాంతాల్లో హైటెన్షన్ లైన్లు వంగిపోయి ఇళ్లవిూదుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఎంత డబ్బయినా ఇస్తామని.. నగరంలో ఇక ఇళ్లవిూద నుంచి ఉన్న హైటెన్షన్ లైన్లన్నింటినీ వెంటనే తొలగించాలని ఆయన విద్యుత్ అధికారులకు సూచించారు. ఇక మరికొన్ని చోట్ల మురుగునీటి పైపులైన్లు, మంచినీటి పైపులైన్లు కలిసి ఉన్నాయని, దానివల్ల ఇబ్బంది అవుతోందని.. ఏడాది, రెండేళ్లలో మొత్తం లైన్లన్నీ మార్చేయాలని తెలిపారు. అన్నింటికంటే పెద్ద సమస్య నాలాలని కేసీఆర్ విస్పష్టంగా చెప్పారు. నగరంలో మొత్తం 77 నాలాలున్నాయని, రెండు మాత్రం హుస్సేన్ సాగర్లో కలుస్తాయని, మిగిలిన 72 మూసీలో కలుస్తాయని.. వీటి నిడివి 390 కిలోవిూటర్లని వివరించారు. అయితే ఇవన్నీ నూరుశాతం ఆక్రమణల్లో ఉన్నాయని ఆయన కుండ బద్దలుకొట్టినట్లు చెప్పారు. గతంలో ఉన్న కార్పొరేటర్లు, అధికారులకు చేతులెత్తి నమస్కరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవి ఆక్రమణలకు గురయితే వీరంతా ఏం చేశారో అని ఎద్దేవా చేశారు. నాలాల్లో చెత్త, చెదారం వేస్తున్నారని, విరిగిన బకెట్లు, పాడైన పరుపులు కూడా వేస్తున్నారని చెప్పారు. వీటన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 26న హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేశానని, అందులో ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తానని అన్నారు. పేదలకు గృహనిర్మాణం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. వాళ్లకు గౌరవప్రదమైన పద్ధతిలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే భూములు సేకరించడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో చూడటం ద్వారా సమగ్ర గృహనిర్మాణం చేయిస్తామన్నారు. ముందు ముందు హైదరాబాద్లో స్లమ్ కల్చర్ అన్నది లేకుండా చూడాలని తెలిపారు. ఇకపోతే ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు వేరుగా వేసేలా ప్రజలలో చైతన్యం కలిగించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తడి పొడి చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి రెండు చెత్త డబ్బాలు సరఫరా చేస్తామని అన్నారు. ఇంటి నుంచి చెత్త ఆటోలకు, ఆటో నుంచి లారీకి, లారీ నేరుగా డంపింగ్ యార్డులో చెత్తను డంప్ చేసే విధంగా చర్యలు తసీఉకుంటే తప్ప సమస్య పరిస్కరాం కాదన్నారు. అలాగే వ్యాపారులు షాపులు తీసాక ఇష్టం వచ్చినట్లుగా చెత్త వేయకుండా చూడాల్సి ఉందన్నారు. అవసరమైతే చట్టాన్ని కూడా తీసుకుని వస్తామని అన్నారు. చెత్తను తరలించేందుకు ఆటో ట్రాలీలను సిద్ధం చేస్తున్నామని, ఈ ట్రాలీ ఆటోలను బస్తీల్లోని నిరుద్యోగుల అప్పగిస్తామని ప్రకటించారు. చెత్తను తొలగించేందుకు 2500 ఆటోలు వినియోగిస్తామని, వీటి ద్వారా హైదరాబాద్ రోడ్లపై ఇక నుంచి చెత్తాచెదారం కనబడకూడదన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా దుకాణ దారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంతవరకు జరిగిన స్వచ్ హైదరాబాద్ ఒక ఎత్తు, ఇకపై ప్లాన్ చేయడం మరొక ఎత్తు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు, జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్ కుమార్ , డిజిపి, నగర పోలీస్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ లఘు చిత్రాన్ని ప్రర్శించారు. ఈ సందర్భంగా కవి దేశిపతి శ్రీనివాస్ హైదరాబాద్‌పై పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.