అవుట్‌లుక్‌ ఖండకావరం

C

– మహిళ అధికారి ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా కథనం

– మండిపడ్డ తెలంగాణ

– పత్రికా యాజమాన్యానికి పరువునష్టం నోటీసు

– తీవ్రంగా ఖండించిన ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి):

తనపై అసభ్య కథనాలు రాసిన ఔట్‌లుక్‌ మ్యాగ్జిన్‌పై తెలంగాణ సీఎంవోలోని అడిషనల్‌ సెక్రటరీ స్మితా సబర్వాల్‌ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు తన న్యాయవాది ద్వారా ఔట్‌లుక్‌ పత్రికకు లీగల్‌ నోటీసు పంపించారు. తన క్లయింట్‌ స్మితా సబర్వాల్‌ ను కించపరిచేలా కథనాలు రాశారని దానిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాది ఐదు పేజీల నోటీసు పంపించారు. తన క్లయింట్‌ స్మితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. ఏ పేజీలో అయితే కథనం రాశారో అదే పేజీలో అంతే నిడివితో క్షమాపణ చెబుతూ ప్రచురించాలని తెలిపారు. లేదంటే చట్టపరంగా సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ఔట్‌లుక్‌ నుంచి సమాధానం రాగానే పరువు నష్టం దావా వేసే యోచనలో స్మితా సబర్వాల్‌ ఉన్నారు. స్మితా సభర్వాల్‌ మంచి పేరున్న అధికారి.  పీపుల్స్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న స్మితా సభర్వాల్‌పై ఔట్‌లుక్‌  పత్రికలో చవకబారు కథనాలు, కార్టూన్లు ప్రచురిచండంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. కనీస హేతుబద్ధత లేకుండా స్టోరీ ప్రచురించడంపై తెలంగాణ జర్నలిస్టు నాయకులు మండిపడ్డారు. స్మిత  తెలంగాణలోని కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. స్మితా పనితనం నచ్చిన సీఎం కేసీఆర్‌ తన పేషీలో అడిషనల్‌ సెక్రెటరీగా నియమించారు. తెలంగాణ ప్రభుత్వంపైన, బాగా పనిచేసే అధికారులపైనా బురదజల్లే క్రమంలోనే అప్పడప్పుడు కొందరు ఇలాంటి చవకబారు, చీప్‌ ట్రిక్స్‌ ఉపయోగిస్తుంటారని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఔట్‌లుక్‌ కథనం వెనక కూడా కుట్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ కథనంపై తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ అల్లం నారాయణ తీవ్రంగా స్పందించారు. స్మితా సబర్వాల్‌పై అనుచిత, వక్ర కథనాన్ని రాయడాన్ని ఖండించారు. స్మితా సబర్వాల్‌ సమర్థవంతమైన ప్రజా సేవకురాలని, అధికారి అని పేర్కొన్నారు. అలాంటి ఉత్తమ అధికారిపై ఔట్‌లుక్‌ పత్రికలో అనుచిత కథనం రాయడమంటే సీఎంవో, తెలంగాణ రాష్టాన్న్రి, ప్రజలను అవమానించడమేనని అన్నారు. ఔట్‌లుక్‌ నీచమైన కథనంతో ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిని కించపరిచిందని మండిపడ్డారు. ఆమెకు ఔట్‌లుక్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.